Punjab Lottery: అదిరిపోయే లాటరీ తగిలినా... ఆచూకీ లేని విజేత!

Punjab Lottery Winner Missing After Winning Diwali Bumper
  • భఠిండాలో అమ్మిన టికెట్‌కు రూ.11 కోట్ల జాక్‌పాట్
  • ఇంకా వెలుగులోకి రాని లాటరీ విజేత
  • పన్నుల తర్వాత చేతికి రూ.7.7 కోట్లు అందే అవకాశం
  • టికెట్ అమ్మిన నిర్వాహకుడికి ప్రత్యేక కమీషన్
పంజాబ్‌లో ఒక అదృష్టవంతుడిని దీపావళి బంపర్ లాటరీ వరించింది. ఏకంగా రూ.11 కోట్ల జాక్‌పాట్ తగలడంతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అయితే, ఆ విజేత ఎవరనేది మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. పంజాబ్ ప్రభుత్వం లాటరీ ఫలితాలు ప్రకటించినా, విజేత ఇంకా బయటకు రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భఠిండాలోని రతన్ లాటరీ కేంద్రంలో ఈ టికెట్‌ను విక్రయించారు. ఈ సందర్భంగా లాటరీ కేంద్రం నిర్వాహకుడు ఉమేశ్ మాట్లాడుతూ.. తన వద్ద టికెట్లు కొనేవారిలో దాదాపు 40 శాతం మంది తమ వివరాలు వెల్లడించరని, ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకుంటారని తెలిపారు. తాను గత 35-40 ఏళ్లుగా లాటరీలు అమ్ముతున్నానని, తన దుకాణంలో టికెట్లు కొని 40 మందికి పైగా కోటీశ్వరులయ్యారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

లాటరీ నిబంధనల ప్రకారం.. విజేత 25 రోజుల్లోగా తమ టికెట్‌తో వచ్చి నగదును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఎవరూ రాకపోతే, ఆ మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది. గెలుచుకున్న రూ.11 కోట్లలో పన్నులు పోనూ, విజేత చేతికి సుమారు రూ.7.7 కోట్లు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ బంపర్ లాటరీ టికెట్‌ను అమ్మినందుకు ఉమేశ్‌కు కూడా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కమీషన్ లభించనుంది. ఈ వార్త తెలియడంతో ఆయన దుకాణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అందరూ ఆ అదృష్టవంతుడు ఎవరై ఉంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Punjab Lottery
Diwali Bumper Lottery
Lottery Winner
Bathinda
Ratan Lottery Center
Umesh
Punjab Government
Jackpot
Lottery Claim

More Telugu News