Anant Singh: జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య.. జేడీయూ అభ్యర్థి అరెస్ట్

Anant Singh Arrested in Dularchand Yadav Murder Case
  • ఎన్నికల ప్రచారంలో జన సురాజ్ కార్యకర్త దులార్‌చంద్ యాదవ్ మృతి
  • పోస్టుమార్టంలో కాల్పుల వల్ల చనిపోలేదని వెల్లడి
  • అనంత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. అధికారుల బదిలీ
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. జన సురాజ్ పార్టీ కార్యకర్త దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో జేడీయూ అభ్యర్థి, వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను పాట్నా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. పాట్నా ఎస్ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం బార్‌లోని ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సంబంధం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురినీ త్వరలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

గురువారం మోకామాలో జన సూరాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున ప్రచారం చేస్తుండగా దులార్‌చంద్ యాదవ్ మరణించారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ కాల్పుల వల్ల ఆయన చనిపోలేదని, పక్కటెముకలు విరగడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే మరణించారని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఈ ఘటనతో బీహార్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజుకుంది.

పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ "దులార్‌చంద్ యాదవ్ హత్య కేసుకు సంబంధించి అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్‌లను అరెస్ట్ చేశాం. ప్రాథమిక విచారణ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చాం" అని తెలిపారు. ప్రత్యర్థి వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత యాదవ్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన వివరించారు. ఘటన జరిగినప్పుడు అనంత్ సింగ్ తన అనుచరులతో అక్కడే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

ఈ అరెస్టుపై జన సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి స్పందిస్తూ.. "ఇది మంచి పరిణామమే అయినా, పోలీసులు ముందుగానే చర్య తీసుకుని ఉంటే బాగుండేది. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఆయన 50 వాహనాల కాన్వాయ్‌తో ప్రచారం చేశారు. ఆలస్యమైనా సరైన చర్యే. ఇప్పుడు పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారన్నదే ముఖ్యం" అని అన్నారు.

ఈ ఘటనపై పోలీసులు మొత్తం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బాధితుడి మనవడు ఇచ్చిన ఫిర్యాదులో అనంత్ సింగ్‌తో పాటు మరో నలుగురి పేర్లు చేర్చారు. అయితే, ఇది తనపై ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని అనంత్ సింగ్ ఆరోపించారు. మోకామా నుంచి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీణా దేవి భర్త, మాజీ ఎంపీ సూరజ్ భాన్ సింగ్ ఈ దాడి చేయించారని ఆయన ఆరోపణలు చేశారు.

ఈ హింసాత్మక ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. పాట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్‌ను బదిలీ చేయాలని ఆదేశించింది. బార్ సబ్-డివిజనల్ ఆఫీసర్, ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. వారిలో ఒకరిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Anant Singh
Bihar Elections
Jan Suraj Party
Dularchand Yadav Murder
JDU Candidate Arrest
Mokama Bihar
Piyush Priyadarshi
Patna Police
Bihar Politics
Crime

More Telugu News