ఇది నేను సానుభూతి కోసం చెప్పడంలేదు: సుధీర్ బాబు

  • మహేశ్‌ బాబును సినిమా కోసం సిఫార్సు చేయమని ఎన్నడూ అడగలేదు
  • ఎన్నో ఆఫీసులు తిరిగాను, అందరిలాగే ఆడిషన్స్ ఇచ్చాను
  • ఆఫీసుల్లో కాఫీ ఇచ్చి, ఆ తర్వాత అవకాశం లేదని చెప్పేవారు
  • కృష్ణానగర్ కష్టాలు తెలియవు కానీ ఫిలింనగర్ బాధలు తెలుసు
  • నవంబర్ 7న 'జటాధర' సినిమా విడుదల
తన సినీ ప్రయాణంలో అవకాశాల కోసం బావ, స్టార్ హీరో మహేశ్‌ బాబును ఏనాడూ సిఫార్సు చేయమని అడగలేదని నటుడు సుధీర్ బాబు స్పష్టం చేశారు. అందరిలాగే తానూ ఆఫీసుల చుట్టూ తిరిగి, ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు దక్కించుకున్నానని అన్నారు. శనివారం రాత్రి జరిగిన తన కొత్త చిత్రం ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తన కెరీర్ ఆరంభంలోని కష్టాలను గుర్తుచేసుకున్నారు.
 
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ, ‘‘సూపర్‌స్టార్ కృష్ణ గారి అల్లుడిగా, మహేశ్‌ బాబు బావగా ఉండటం నాకు గర్వకారణం, అదొక పెద్ద బాధ్యత. అయితే, సినిమాల్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఏ ఆఫీసుకు వెళ్లినా మొదట బాగా మాట్లాడి, కాఫీ ఇచ్చి, ఆ తర్వాత అవకాశం లేదని చెప్పేవారు. నాకు కృష్ణానగర్‌లోని కష్టాలు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్‌లోని బాధలు తెలుసు. బస్సుల్లో తిరిగి అవకాశాలు వెతుక్కోవడం తెలియకపోవచ్చు, కానీ కారులో కూర్చుని బాధపడటం తెలుసు. ఇది సానుభూతి కోసం చెప్పడం లేదు. అలా చెప్పాలనుకుంటే నా మొదటి సినిమా సమయంలోనే చెప్పేవాడిని’’ అని అన్నారు.
 
‘‘ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలనుకున్న నేను ఇప్పటికి 20 చిత్రాలు పూర్తి చేశాను. ఇందులో హిట్స్, ఫ్లాప్స్ రెండూ ఉన్నాయి. అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటాను. నా తొలి సినిమాలో వాయిస్ బాగోలేదన్నారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో ఇప్పటికీ రోజూ గంటపాటు వాయిస్ కల్చర్‌పై శిక్షణ తీసుకుంటున్నాను. బాడీ చూపిస్తాడనే కామెంట్లు రావడంతో ‘సమ్మోహనం’ లాంటి సాఫ్ట్ సినిమా చేశాను. అర్బన్ కథలే ఎంచుకుంటాడంటే ‘శ్రీదేవి సోడా సెంటర్‌’తో మాస్ ప్రయత్నం చేశాను’’ అని సుధీర్ బాబు వివరించారు.
 
‘‘నా కెరీర్‌లో ఏ దర్శకుడిని ఒక ఫైట్ పెట్టమని, ఏ నిర్మాతను ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వమని అడగలేదు. అలాగే మహేశ్‌ను కూడా నా కోసం రికమెండ్ చేయమని ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే నాకు అవకాశం విలువ తెలుసు. నేను 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు.. కృష్ణ గారి అల్లుడు, మహేశ్‌బాబు వాళ్ల బావ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహించిన ‘జటాధర’ చిత్రంతో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.


More Telugu News