కాశీబుగ్గలో పెను విషాదం... రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

  • కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి
  • అంచనాలకు మించి భక్తులు తరలిరావడమే ప్రమాదానికి కారణం
  • క్షతగాత్రులను పరామర్శించి, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

విషాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులతో కలిసి హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే మెరుగైన ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. తక్షణ ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున అందజేశామని వివరించారు.

ఈ ఘటనపై ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం అందించామని, వారు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారని లోకేశ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని, పార్టీ ప్రమాద బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు అదనంగా రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News