చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని గెంటేశారు... కవిత కన్నీరు పెట్టుకున్నారు: జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి

  • చెల్లిని ఇంట్లో నుంచి పంపిన వ్యక్తి మాగంటి సునీతను చూస్తారా అని ప్రశ్న
  • కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న రేవంత్ రెడ్డి
  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఇంట్లో నుంచి గెంటేశారని, అందుకు కవిత కన్నీటి పర్యంతమయ్యారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొంత చెల్లిని ఇంట్లోంచి పంపిన వ్యక్తి మాగంటి సునీతను బాగా చూసుకుంటారని ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. ముందుగా కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బోరబండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చెల్లికి అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయల అక్రమాస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కవితపై కుట్ర చేశారని ఆరోపించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారని స్వయంగా కవిత చెప్పారని గుర్తు చేశారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. ఇక్కడికి విజయోత్సవ ర్యాలీకి వస్తామని, పీజేఆర్ బోరబండగా నామకరణం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు.


More Telugu News