ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది.. బంద్‌కు పిలుపునిస్తున్నాం: తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

  • నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ చేస్తున్నామన్న సమాఖ్య చైర్మన్ రమేశ్ బాబు
  • ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలపై 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపామన్న రమేశ్ బాబు
  • తమ మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్న రమేశ్ బాబు
ప్రభుత్వం తమను బెదిరింపులకు గురి చేస్తోందని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫతేమైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలపై గత 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపామని, ప్రస్తుతం రూ. 1,200 కోట్లు ఇవ్వాలని కోరామని తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

అయితే, ప్రభుత్వం రూ. 300 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన రూ. 900 కోట్లు దీపావళికి విడుదల చేయాలని, అలాగే నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ బకాయిల గురించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో సహా అందరినీ కలిశామని, కానీ అధికారులు తమ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారని ఆయన అన్నారు. ప్రభుత్వం తమను బెదిరింపులకు గురి చేస్తోందని, తమ మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని అన్ని వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ 3 నుంచి నిరవధికగా మూసివేయబడతాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేపటిలోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ బంద్ సమయంలో పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6న అన్ని కళాశాలల సిబ్బందితో కలిసి దాదాపు లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు.

నవంబర్ 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఒకటి రెండు కళాశాలలకు మాత్రమే బకాయిలు ఎందుకు చెల్లించారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. 10 శాతం లంచం తీసుకుని నిధులు విడుదల చేశారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బంద్ కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి ఆయన క్షమాపణలు తెలిపారు.


More Telugu News