హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన నారా భువనేశ్వరి

  • ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భువనేశ్వరి సందడి
  • విద్యార్థులతో ముచ్చటించిన నారా భువనేశ్వరి
  • ఎన్టీఆర్ కుటీరంలో జరిగే స్పోర్ట్స్ ఫెస్ట్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో ఆమె విద్యార్థులతో సరదాగా గడిపారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం టాస్ వేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వారితో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు.

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్‌లో ఉన్న ఎన్టీఆర్ కుటీరంలో మూడు రోజుల పాటు జరిగే ఎన్టీఆర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ పోటీలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా కాకుండా ఒక అమ్మలాంటి వ్యక్తిగా వ్యవహరిస్తున్నానని అన్నారు. తమ ట్రస్ట్ సంపద కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతోందని తెలిపారు. దేశానికి సేవ చేసే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలోనే జీవితంపై అవగాహన పెంచుకుని ముందుకు సాగలని సూచించారు.

ఎన్ని అవరోధాలు వచ్చినా వెనక్కి చూడకుండా ముందుకు సాగడమే లక్ష్యంగా విద్యార్థి దశలోనే ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె అన్నారు. ఈ క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, మీ భవిష్యత్తు కలలకు వేదిక అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో చదువుకున్న విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వారు దేశం కోసం పని చేస్తున్నారని తెలిపారు. మీ నమ్మకమే మార్గం సుగమం చేస్తుందని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, అందుకు తమ ట్రస్ట్ పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రారంభమైన ఈ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో దాదాపు 40 పాఠశాలలు, కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.


More Telugu News