ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు, సిబ్బందిని అభినందించిన ఏపీ డీజీపీ

  • కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో వేగంగా దర్యాప్తు
  • కేవలం 13 గంటల్లోనే మృతుల డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్
  • ఫోరెన్సిక్‌ డైరెక్టర్ పాలరాజు, బృందాలను అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • త్వరితగతిన పరీక్షలు పూర్తి చేయడంతో బాధితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత
  • సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించిన డీజీపీ
కర్నూలు శివారులో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్ ప్రయోగశాల సిబ్బంది చూపిన అసాధారణ ప్రతిభపై డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రశంసలు కురిపించారు. ప్రమాదంలో సజీవ దహనమైన వారి మృతదేహాలకు కేవలం 13 గంటల వ్యవధిలోనే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తిచేసి నివేదికలు అందించారని కొనియాడారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్ డైరెక్టర్‌ పాలరాజు, సంబంధిత బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
 
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ .. ఫోరెన్సిక్‌ నిపుణులు అత్యంత వేగంగా డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ పూర్తి చేయడం వల్లే మృతదేహాలను త్వరితగతిన గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం సాధ్యమైందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
 
ప్రమాద స్థలంలో లభ్యమైన భౌతిక, రసాయన, జీవ సంబంధిత నమూనాలను విశ్లేషించడంలో, అలాగే 'సీన్‌ రీక్రియేషన్' చేయడంలో ఫోరెన్సిక్‌ బృందాలు కీలక పాత్ర పోషించాయని డీజీపీ వివరించారు. ఈ సంక్లిష్టమైన విశ్లేషణలో భాగస్వాములైన 16 బృందాలలోని సభ్యులను డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేసి గౌరవించారు. వారి వృత్తి నైపుణ్యం, అంకితభావం ప్రశంసనీయమని ఆయన అన్నారు.


More Telugu News