నా భార్య మతం మారదు.. వివాదంపై స్పందించిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

  • తన భార్య ఉష క్రైస్తవ మతంలోకి మారడం లేదని స్పష్టం చేసిన జేడీ వాన్స్
  • భార్య మతంపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న యూఎస్ ఉపాధ్యక్షుడు
  • సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా విమర్శకులకు ఘాటుగా సమాధానం
  • తన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సాధారణమేనని వ్యాఖ్య
  • ఏళ్ల క్రితం తనను దేవుడిపై విశ్వాసం పెంచుకునేలా ప్రోత్సహించిందే తన భార్య అని వెల్లడి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష మతం గురించి చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై స్పందించారు. తన భార్య క్రైస్తవ మతంలోకి మారడం లేదని, అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విమర్శలను అసహ్యకరమైనవిగా పేర్కొన్న‌ ఆయన, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు.

ఇటీవల మిస్సిసిపీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన, హిందూ మతంలో పెరిగిన తన భార్య ఉష కూడా క్రైస్తవం స్వీకరిస్తే బాగుంటుందని వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పిల్లలను క్రైస్తవులుగా పెంచుతున్నామని, చాలా ఆదివారాలు ఉష కూడా తమతో పాటు చర్చికి వస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "రాజకీయ లబ్ధి కోసం భార్య మతాన్ని బహిరంగంగా కించపరిచారు" అంటూ ఒక నెటిజన్ చేసిన పోస్టుకు వాన్స్ స్పందించారు.

"నేను ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని. నా మతాంతర వివాహం గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఏళ్ల క్రితం తనను తిరిగి దేవుడిపై విశ్వాసం పెంచుకునేలా ప్రోత్సహించిందే తన భార్య అని ఆయన గుర్తుచేశారు.

"ఆమె క్రైస్తవురాలు కాదు, మతం మారే ఆలోచన కూడా లేదు. కానీ, మతాంతర వివాహం చేసుకున్న చాలామంది లాగానే, నా భార్య కూడా ఏదో ఒకరోజు నాలాగే చూడచ్చని ఆశిస్తున్నాను. నా విశ్వాసాలను ఇతరులతో పంచుకోవాలని అనుకోవడం చాలా సాధారణ విషయం. దీనిని విమర్శించే వారికి వేరే అజెండా ఉంది. ఈ విమర్శల్లో క్రైస్తవ వ్యతిరేక దురభిమానం కనిపిస్తోంది" అని వాన్స్ తెలిపారు.

మిస్సిసిపీ కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ, "ఒకవేళ నా భార్య మతం మారకపోయినా నాకేమీ సమస్య లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఇది కుటుంబ సభ్యులతో, ప్రేమించేవారితో కలిసి పరిష్కరించుకోవాల్సిన విషయం" అని కూడా వ్యాఖ్యానించారు.




More Telugu News