తుపాను నష్టంపై ప్రధాని మోదీతో వ్యక్తిగతంగా మాట్లాడతా: సీఎం చంద్రబాబు

  • మొంథా తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • తుపాను నష్టంపై కేంద్రానికి తక్షణ నివేదికకు ఆదేశం
  • శాటిలైట్ చిత్రాలతో నీటమునిగిన పొలాల గుర్తింపు
  • యుద్ధప్రాతిపదికన పొలాల నుంచి నీటిని మళ్లించాలని సూచన
  • తుపాను విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 100 మందికి సన్మానం
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే ప్రాథమిక నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలని, తుది నివేదిక అందేలోపు తక్షణ సాయం కోరాలని సూచించారు. ఈ విషయమై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా మాట్లాడతానని ఆయన తెలిపారు. తుఫాన్ అనంతర సహాయక చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాల నుంచి యుద్ధప్రాతిపదికన నీటిని మళ్లించి రైతులను ఆదుకోవాలని సీఎం స్పష్టం చేశారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి, శనివారం నాటికల్లా ఆ నీటిని పూర్తిగా మళ్లించే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. పంట దిగుబడి తగ్గిపోకుండా ఉండేందుకు శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా బాపట్ల జిల్లాలోనే అత్యధికంగా 60 శాతం వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల జిల్లాలో ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు. మరోవైపు, కృష్ణా నదిలో వరద ఉధృతి ప్రస్తుతం తగ్గిందని అధికారులు వెల్లడించారు.

మొంథా తుఫాన్ సహాయక చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 100 మంది సిబ్బందిని గుర్తించి సన్మానించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు.


More Telugu News