అమరావతి పనుల్లో జాప్యం వద్దు... గడువులోగా పూర్తి చేయాల్సిందే: సీఎం చంద్రబాబు

  • అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టీకరణ
  • రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
  • రాజధాని సుందరీకరణ, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం
  • ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షిస్తానని వెల్లడి
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని సూచించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజధానిలో చేపట్టిన భవన నిర్మాణాల పురోగతి, సుందరీకరణ పనులు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఏయే నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎంతమంది వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉన్నారు, నిర్మాణ సంస్థలు అవసరమైన మెషినరీ, మెటీరియల్‌ను సమకూర్చుకున్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు.

ఇటీవల కురిసిన వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినా, రానున్న రోజుల్లో దానిని భర్తీ చేసేలా వేగం పెంచాలని సూచించారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో వర్క్ ఫోర్స్, మెషినరీని కేటాయించలేదని, అలాంటి సంస్థలు తమ పనితీరును వెంటనే మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

రైతులకు ఇబ్బందులు రానీయొద్దు

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి నారాయణ, అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇంకా 2,471 మంది రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, కొన్ని సాంకేతిక, రైతుల వ్యక్తిగత కారణాల వల్ల ఇవి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. త్వరలోనే తాను రాజధాని రైతులతో సమావేశమవుతానని చంద్రబాబు తెలిపారు.

నిర్మాణాలతో పాటు రాజధానిలో పచ్చదనం, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతికి 'వరల్డ్ క్లాస్ సిటీ' లుక్ రావాలంటే ఆకాశహర్మ్యాలు (హైరైజ్ బిల్డింగులు) అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్‌లో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.


More Telugu News