కిషన్ రెడ్డి 'దేశద్రోహి' వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన అజారుద్దీన్

  • కిషన్ రెడ్డి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న అజారుద్దీన్
  • తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్య
  • కిషన్ రెడ్డికి అవగాహన లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారన్న అజారుద్దీన్
తనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని ఆయన అన్నారు. తనపై ఒక్క కేసులో కూడా నేరం రుజువు కాలేదని ఆయన స్పష్టం చేశారు.

తన గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదని వ్యాఖ్యానించారు. తన దేశభక్తి గురించి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రిగా అవకాశం కల్పించినందుకు ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని అజారుద్దీన్ అన్నారు. మంత్రి పదవి దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశద్రోహులకు మంత్రి పదవి ఎలా ఇస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అజారుద్దీన్ పై విధంగా స్పందించారు.


More Telugu News