ముంబై స్టూడియోలో కమాండో ఆపరేషన్.. బందీలకు విముక్తి.. నిందితుడి హతం

  • ముంబై ఫిల్మ్ స్టూడియోలో 17 మంది పిల్లలు సహా 19 మంది బందీ
  • బందీలను సజీవ దహనం చేస్తానని నిందితుడి బెదిరింపు
  • విఫలమైన చర్చలు, రంగంలోకి దిగిన కమాండోలు
  • బాత్రూమ్ కిటికీ నుంచి లోపలికి ప్రవేశించి నిందితుడి కాల్చివేత
  • బందీలందరినీ సురక్షితంగా కాపాడిన పోలీసులు
  • ప్రభుత్వ టెండర్ వివాదమే కారణమని వెల్లడి
ముంబైలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన బందీల డ్రామా సుఖాంతమైంది. ఫిల్మ్ ఆడిషన్ పేరుతో 17 మంది పిల్లలు సహా 19 మందిని ఓ స్టూడియోలో బంధించిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాలో బందీలందరినీ కమాండోలు సురక్షితంగా కాపాడారు.

గురువారం మధ్యాహ్నం ఆర్ఏ స్టూడియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోహిత్ ఆర్య (38) అనే వ్యక్తి ఫిల్మ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి 17 మంది పిల్లలను, ఓ వృద్ధుడిని, మరికొందరిని స్టూడియో హాల్‌లోకి పిలిచాడు. వారంతా లోపలికి రాగానే తలుపులకు తాళం వేసి బందీలుగా పట్టుకున్నాడు. స్టూడియోను సెన్సర్లతో నింపి, నిప్పు పెడతానని బెదిరించడంతో తీవ్ర భయాందోళన నెలకొంది.

మధ్యాహ్నం 1:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రోహిత్‌తో చర్చలు ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు ప్రయత్నించినా అతను లొంగలేదు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే బందీలను సజీవ దహనం చేస్తానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. సాయంత్రం 3:50 గంటల ప్రాంతంలో ఫైర్ సిబ్బంది సాయంతో స్టూడియోలోని ఓ బాత్రూమ్ కిటికీని పగలగొట్టారు. దాని ద్వారా క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టీ) కమాండోలు లోపలికి ప్రవేశించారు.

కమాండోలను చూసిన రోహిత్ ఆర్య తన వద్ద ఉన్న ఆయుధంతో కాల్పులు జరిపాడు. అది నిజమైన తుపాకీ అని భావించిన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఛాతీలోకి తూటా దూసుకెళ్లడంతో ఆర్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం పోలీసులు బందీలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

పోలీసులు స్టూడియోను పరిశీలించగా, నిందితుడు హాల్‌లోని అన్ని కిటికీలు, తలుపులకు మోషన్ సెన్సార్లు అమర్చినట్లు, సీసీటీవీ కెమెరాలను పక్కకు తిప్పినట్లు గుర్తించారు. అతని వద్ద ఎయిర్ గన్‌తో పాటు కొన్ని రసాయనాలు, లైటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

పూణెకు చెందిన రోహిత్ ఆర్యకు ప్రభుత్వ టెండర్‌కు సంబంధించి పాత గొడవలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన దీపక్ కేసర్కార్ హయాంలో తనకు ఓ ప్రాజెక్ట్ కేటాయించారని, దానికి సంబంధించిన డబ్బులు చెల్లించలేదని అతడు ఆరోపిస్తున్నాడు. అయితే, అతడి ప్రాజెక్టులో స్పష్టత లేదని, పత్రాలు సరిగా లేవని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. చనిపోవడానికి ముందు రికార్డ్ చేసిన ఓ వీడియోలో, తనకు డబ్బు వద్దని, నైతిక న్యాయం మాత్రమే కావాలని ఆర్య పేర్కొన్నాడు.


More Telugu News