నేను దాదాపు ప్రతిరోజూ ఏడ్చాను.. కానీ దేవుడే అన్నీ చూసుకున్నాడు: జెమీమా భావోద్వేగం

  • ప్రపంచకప్ సెమీస్‌లో జెమీమా రోడ్రిగ్స్ అజేయ శ‌త‌కం
  • ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి జెమీమా 167 పరుగుల కీలక భాగస్వామ్యం
  • తీవ్ర మానసిక ఒత్తిడి నుంచి కోలుకొని అద్భుత ప్రదర్శన
  • తన విజయం వెనుక దేవుడి దయ ఉందన్న‌ జెమీమా
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత పోరాటంతో చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదనలో అజేయ శతకంతో చెలరేగి, జట్టును ఫైనల్‌కు చేర్చింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో జెమీమా అసాధారణ ఇన్నింగ్స్‌తో భార‌త్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జ‌ట్టు, జెమీమా (127 నాటౌట్; 134 బంతుల్లో 14 ఫోర్లు) వీరోచిత సెంచరీకి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) అద్భుత ఇన్నింగ్స్ తోడవడంతో 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది. వీరిద్దరి మధ్య నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.

ఈ ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమై, ఒక మ్యాచ్‌కు జట్టులో స్థానం కూడా కోల్పోయిన జెమీమా... అత్యంత కీలకమైన సెమీఫైనల్‌లో సెంచరీతో కదం తొక్కడం ఆమె మానసిక స్థైర్యానికి నిదర్శనం. 115 బంతుల్లో 10 ఫోర్లతో ఆమె తన తొలి ప్రపంచకప్ శతకాన్ని పూర్తి చేసుకుంది.

మ్యాచ్ అనంతరం జెమీమా మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. "ఈ విజయం నా ఒక్కదాని వల్ల సాధ్యం కాలేదు. దీనికి కారణమైన జీసస్‌కు, నన్ను నమ్మిన అమ్మానాన్నకు, కోచ్‌కు ధన్యవాదాలు. గడిచిన నెల రోజులుగా ఎంతో కష్టపడ్డాను. ఇదంతా ఒక కలలా ఉంది. నా సెంచరీ కంటే దేశం గెలవడమే నాకు ముఖ్యం" అని పేర్కొంది. ఇక‌, ఈ మ్యాచ్‌లో తాను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తానని కూడా తనకు తెలియదని, ఐదు నిమిషాల ముందే తనకు ఈ విషయం తెలిసిందని ఆమె వెల్లడించింది.

"ఈ టూర్ మొత్తంలో నేను మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. దాదాపు ప్రతిరోజూ ఏడ్చాను. తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొన్నాను. కానీ దేవుడే అన్నీ చూసుకున్నాడు. క్రీజులో ఉన్నప్పుడు బైబిల్‌లోని ఓ వాక్యాన్ని పదేపదే గుర్తుచేసుకున్నాను. 'నువ్వు నిశ్చలంగా ఉండు, నీ కోసం దేవుడే పోరాడుతాడు' అన్నదే ఆ వాక్యం. నేను నిలబడ్డాను, ఆయనే నా కోసం పోరాడారు" అని జెమీమా తెలిపింది.

"హ్యారీ దీ (హర్మన్‌ప్రీత్) క్రీజులోకి వచ్చాక మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. చివరిలో నేను అలసిపోయినప్పుడు దీప్తి శర్మ ప్రతి బంతికీ నన్ను ప్రోత్సహించింది. మైదానంలోని ప్రేక్షకులు ప్రతి పరుగుకూ అరిచి నన్ను ఉత్సాహపరిచారు" అంటూ తన సహచరులకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలియ‌జేసింది.




More Telugu News