Donald Trump: చైనాకు ఆ టారిఫ్ నుంచి ఊరట: జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన

Donald Trump Announces Tariff Relief for China After Xi Jinping Meeting
  • దక్షిణ కొరియా వేదికగా సమావేశమైన ట్రంప్, జిన్‌పింగ్
  • ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
  • జిన్‌పింగ్‌కు పదికి 12 మార్కులంటూ ప్రశంస
చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌ను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరుదేశాల అధినేతలు దక్షిణ కొరియా వేదికగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అంతర్గతంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, జీ జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. ఫెంటనిల్ తయారీలో ఉపయోగించే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్‌పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని విశ్వసిస్తున్నానని అన్నారు. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.

అదే సమయంలో అమెరికా సోయాబిన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైనట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అన్నారు. ఏడాది పాటు ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్‌పింగ్ గొప్ప నేత అని, ఆయనకు పదికి 12 మార్కులు ఇస్తానని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశంలో అమెరికాతో కలిసి పని చేసేందుకు చైనా అంగీకరించిందని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత వీలు చూసుకుని జిన్‌పింగ్ కూడా వస్తారని అన్నారు.
Donald Trump
China tariff
Xi Jinping
US China trade
trade war
Fentanyl
Soybean
Rare minerals

More Telugu News