Harish Rao: హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించిన కవిత

Kavitha Visits Harish Rao to Offer Condolences
  • హరీశ్ తండ్రి మృతి పట్ల కుటుంబానికి సంతాపం
  • అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో రేగిన ఊహాగానాలు
  • గతంలో కాళేశ్వరంపై హరీశ్ ను టార్గెట్ చేసిన కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీశ్ ‌రావును పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు హరీశ్ ఇంటికి వెళ్లిన కవిత, ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

అయితే, ఈ పరామర్శకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరుకాలేదు. దీంతో హరీశ్ తో ఆమెకు ఉన్న విభేదాల కారణంగానే రాలేదంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, మూడు రోజుల తర్వాత కవిత స్వయంగా హరీశ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కవిత... హరీశ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై హరీశ్ నేరుగా స్పందించకపోయినా, తన ప్రస్థానం తెరిచిన పుస్తకం అంటూ పరోక్షంగా సమాధానమిచ్చారు. ఆ వివాదం తర్వాత హరీశ్ ఇంటికి కవిత వెళ్లడం ఇదే మొదటిసారి.
Harish Rao
Kalvakuntla Kavitha
TRS
BRS
Telangana Politics
Kaleshwaram Project
Satyanarayan Rao death
Telangana
Political differences
Condolences

More Telugu News