అతనికి పంది కిడ్నీ 271 రోజులు పనిచేసింది.. వైద్య చరిత్రలో రికార్డు

  • పనితీరు క్షీణించడంతో తాజాగా తొలగించిన వైద్యులు
  • తిరిగి డయాలసిస్ చేయించుకుంటున్న బాధితుడు
  • పంది కిడ్నీపై చేస్తున్న పరిశోధనల్లో కీలక ముందడుగు
మనిషికి జంతువు అవయవాన్ని అమర్చే జెనోట్రాన్స్‌ప్లాంట్‌ చరిత్రలో కీలక ముందడుగు పడిందని అమెరికా వైద్యులు పేర్కొన్నారు. మనిషి శరీరంలో పంది కిడ్నీ 271 రోజులు విజయవంతంగా పనిచేసిందని చెప్పారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ వైద్యులు అండ్రూస్ అనే బాధితుడికి పంది కిడ్నీ అమర్చగా.. 271 రోజుల పాటు చక్కగా పనిచేసింది. తాజాగా ఆ కిడ్నీ పనితీరు క్షీణించడంతో అండ్రూస్ శరీరంలో నుంచి దానిని తొలగించామని వైద్యులు తెలిపారు. మనిషి శరీరంలో అమర్చిన పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పనిచేయడం వైద్య చరిత్రలో ఓ రికార్డని చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. న్యూ హాంప్ షైర్ కు చెందిన టిమ్ అండ్రూస్ (67) కు 1990ల నుంచి డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వారం వారం ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ బాధాకరమైన అనుభవాన్ని తప్పించుకోవడానికి అండ్రూస్ అవయవదాత కోసం ప్రయత్నించాడు. అయితే, అతడికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన అండ్రూస్ బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ వైద్యులను ఆశ్రయించాడు.

వారు ప్రతిపాదించిన జెనోట్రాన్స్ ప్లాంట్ (జంతువుల అవయవాలను మనిషికి అమర్చడం) కు అంగీకరించాడు. దీంతో ఇజెనిసిస్ అనే కంపెనీ పంది కిడ్నీని.. మనిషి శరీరానికి సరిపోయేటట్టు జన్యు మార్పిడి చేసిన తర్వాత ఆండ్రూస్ కు అమర్చారు. 2025 జనవరి 25న ఈ ఆపరేషన్ జరగగా.. కొన్ని రోజుల తర్వాత అండ్రూస్ కు డయాలసిస్ అవసరం లేకుండా పోయింది. పంది మూత్రపిండం అతడి శరీరంలో చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. 

అమెరికాలో ఇలా పంది కిడ్నీ అమర్చిన నాలుగో వ్యక్తిగా ఆండ్రూస్ నిలిచాడు. మొదటి ఇద్దరూ పంది కిడ్నీ అమర్చిన కొద్దిసేపటికే మృతి చెందారు. మూడోసారి ఓ మహిళకు అమర్చగా.. ఆమె 130 రోజులు జీవించి రికార్డు సృష్టించింది. తాజాగా అండ్రూస్ పంది కిడ్నీతో 271 రోజులు జీవించాడు. తాజాగా ఆ కిడ్నీ తొలగించిన వైద్యులు.. అండ్రూస్ కు తిరిగి డయాలసిస్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సంఘటనతో ఇప్పటివరకు మనిషి కిడ్నీకి ప్రత్యామ్నాయంగా.. పంది మూత్రపిండంపై చేస్తున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడినట్లు అయింది.


More Telugu News