ఎనిమిదేళ్లుగా సౌదీ జైల్లో మగ్గుతున్న జగిత్యాల వాసి

  • దొంగతనం చేశాడంటూ యజమాని పెట్టిన మత్లూబ్ కేసు
  • తండ్రిని విడిపించాలంటూ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో కొడుకు విజ్ఞప్తి
  • ఇప్పటికే రెండుసార్లు రియాద్‌లోని భారత ఎంబసీకి వినతి
  • అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్‌ను ఆదుకోవాలని కుటుంబం వేడుకోలు
  • ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇండియాకు తీసుకురావాలని విజ్ఞప్తి
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడి యజమాని పెట్టిన దొంగతనం కేసులో చిక్కుకుని ఎనిమిదేళ్లుగా సౌదీ అరేబియా జైల్లో మగ్గుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అతడి కుమారుడు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన గాజుల శ్రీనివాస్ 2017లో ఆజాద్ వీసాపై సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేసిన తర్వాత, అతని యజమాని 12,000 సౌదీ రియాళ్లు (సుమారు రూ.2.80 లక్షలు) దొంగిలించాడంటూ శ్రీనివాస్‌పై 'మత్లూబ్' (దొంగతనం) కేసు నమోదు చేశాడు. ఈ కేసు కారణంగా గడిచిన ఎనిమిదేళ్లుగా శ్రీనివాస్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

జైల్లో ఉన్న శ్రీనివాస్ ప్రస్తుతం అధిక రక్తపోటు (బీపీ), నరాల సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. తన తండ్రిని ఈ నరకం నుంచి విడిపించాలని కోరుతూ ఆయన కుమారుడు గాజుల సాయికిరణ్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం సమర్పించాడు. ఈ కేసును తొలగించేందుకు సహకరించాలని గతంలో రెండుసార్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని సాయికిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ కుటుంబానికి పెద్ద దిక్కయిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం చొరవ తీసుకుని విడిపించి, ఇండియాకు సురక్షితంగా తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటున్నారు.


More Telugu News