కెరీర్ లో తొలిసారిగా.. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ

  • ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో అద్భుత ప్రదర్శనతో రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్ 
  • 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో రోహిత్ శర్మ
  • రెండో స్థానంలో ఆఫ్ఘాన్ ఆటగాడు ఇబ్రహీం, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్
భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో తొలిసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. 38 ఏళ్ల వయసులో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో/చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకుల్లో ఫలితం కనిపించింది. ఇప్పటి వరకు నెంబర్ వన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు దిగజారి మూడోస్థానానికి పడిపోయాడు. గత దశాబ్ద కాలంలో ఎక్కువ కాలం రోహిత్ శర్మ టాప్ 10లో నిలిచాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆప్ఘనిస్థాన్ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (745 పాయింట్లు), బాబర్ అజామ్ (739), విరాట్ కోహ్లీ (725) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేసినప్పటికీ, అంతకుముందు రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. ఈ కారణంగా అతను ఒక స్థానం పడిపోయాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. శ్రేయస్ అయ్యర్ (700) టాప్ 10లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (589) ఏకంగా 23 పాయింట్లు మెరుగుపర్చుకుని 25వ ర్యాంకుకు చేరుకున్నాడు.

వన్డే బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఆరు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ 10లో కుల్దీప్ యాదవ్ (634) మాత్రమే ఉన్నాడు. ఒక స్థానం దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710) బౌలింగ్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.


More Telugu News