స్టార్స్ .. ఇక టైమ్ కి రాకపోతే కష్టమే!

  • మారుతున్న పరిస్థితులు 
  • పెరుగుతున్న అవకాశాలు 
  • కాలంతో పరుగెత్తడంపైనే దృష్టి 
  • బద్ధకాన్ని వీడవలసిన సమయమే   

ఒకప్పుడు ఉదయం 6 గంటలకు షూటింగ్ అంటే, అరగంట ముందుగానే మేకప్ తో సహా ఎన్టీఆర్ - ఏఎన్నార్ సిద్ధంగా ఉండేవారని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే షూటింగు సమయంలో తమ పనులు చూసుకోవడం చేసేవారు కాదు. నిర్మాత సమయాన్ని ఎంతమాత్రం వృథా చేయకూడదు అనే ఒక నిబద్ధత వారిని తిరుగులేని హీరోలుగా నిలబెట్టింది. ఆ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన వారికి స్ఫూర్తిగా నిలబెట్టింది. 

ఆలస్యంగా షూటింగుకి వచ్చిన ఆర్టిస్టులు ఆ కాలంలోను ఉన్నారు. అలా వచ్చిన ఆర్టిస్టులను వెనక్కి పంపించేసిన నిర్మాతలూ ఉన్నారు. స్టార్స్ షూటింగుకి ఆలస్యంగా వస్తే .. వాళ్లతో కలిసి నటించవలసిన ఇతర నటీనటులు వెయిట్ చేయవలసిందే. అలా కాకుండా అసహనాన్ని వ్యక్తం చేస్తే ఏం జరుగుతుందనేది కూడా వాళ్లకి తెలుసు. అందువలన మౌనంగానే భరించేవారు. ఆ తరువాత కాలంలో కాస్త క్రేజ్ ఉన్న కేరక్టర్ ఆర్టిస్టులు కూడా ఆలస్యంగా రావడం అలవాటు చేసుకోవడం వలన మరింత మంది ఇబ్బంది పడుతూ వచ్చారు. 

అయితే ఈ కాలంలో చిన్న చిన్న ఆర్టిస్టులు కాస్త క్రేజ్ తగ్గిన ఆర్టిస్టులు కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికీ సమయం చాలా విలువైనదిగా మారిపోయింది. అందువలన ఒకరి ఆలస్యాన్ని మరొకరు భరించే పరిస్థితి లేదు. అందువలన ఈ మధ్య కాలంలో సమయ పాలన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది.  నిన్న మురుగదాస్ .. నేడు ఇమ్రాన్ హష్మీ స్పందించడమే అందుకే నిదర్శనం. కొంతమంది ఆర్టిస్టులు లేట్ గా వస్తున్నారు .. ఇంకొంతమంది అసలు సెట్స్ కి రావడమే లేదు అని ఆయన తన సినిమా 'హక్' ప్రమోషన్స్ లో అన్నారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.    



More Telugu News