అప్పు తీసుకుని ముఖం చాటేసిన స్నేహితులు.. కరీంనగర్ లో వైద్యుడి ఆత్మహత్య
- స్నేహితులకు అప్పిచ్చి మోసపోయానని మనోవేదన
- ఇద్దరు మిత్రులకు రూ.1.78 కోట్లు అప్పిచ్చిన డాక్టర్ శ్రీనివాస్
- శ్రీనివాస్ పేరుమీద బ్యాంకు నుంచి రూ.1.35 కోట్ల రుణం తీసుకున్న మరో ముగ్గురు ఫ్రెండ్స్
- ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైద్యుడు
శ్రీనివాస్ తన స్నేహితులు ఇద్దరికి రూ.1.78 కోట్లు అప్పుగా ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని సాయం కోరిన మరో ముగ్గురు స్నేహితులకు బ్యాంకులో తన పేరుమీద రూ.1.35 కోట్ల లోన్ ఇప్పించాడు. అప్పు తీసుకునేటపుడు అంతా బాగానే ఉంది కానీ తిరిగి చెల్లించే విషయంలో స్నేహితులు ముఖం చాటేశారు. మిత్రులు ఎంతకూ తన డబ్బు తిరిగివ్వకపోవడంతో శ్రీనివాస్ మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయమై తన వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశాడని శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ తెలిపారు.
ఈ ఆందోళనతో తన భర్త అనారోగ్యం పాలయ్యాడని, వారం రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడని ఆమె చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున తాను నిద్రలేచేసరికి భర్త నేలపై పడిపోయి కనిపించారని విప్లవశ్రీ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు. తన భర్త మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.