రవితేజ నా పాలిట దేవుడు.. ఆయన వల్లే బతికున్నా: స్టేజ్‌పై కన్నీటి పర్యంతమైన భీమ్స్

  • 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగం
  • సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కన్నీటి పర్యంతం
  • ఆత్మహత్య చేసుకుందామనుకున్న నన్ను రవితేజ కాపాడారని వ్యాఖ్య‌
  • ఆయన వల్లే ఈ రోజు నేను, నా కుటుంబం బతికున్నామంటూ ఎమోష‌న‌ల్‌
  • ఈ నెల‌ 31న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మాస్ జాతర'
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో రవితేజ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. ఒకానొక దశలో జీవితం ముగించుకుందామని అనుకున్న తనను రవితేజ దేవుడిలా వచ్చి కాపాడారని చెప్పడంతో అక్కడున్న అభిమానులు కూడా కంటతడి పెట్టారు.

ఈ సందర్భంగా భీమ్స్ మాట్లాడుతూ, "ఒకప్పుడు నేను పూర్తిగా వెనకబడిపోయాను. ఇంటి అద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, రేపు ఎలా బతకాలి అనే ప్రశ్నలతో చివరి స్థితికి చేరాను. అంతా ముగించేద్దామని నిర్ణయించుకున్న సమయంలో పీపుల్స్ మీడియా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ రావడానికి కారణం రవితేజ సార్. ఆయన లేకపోతే ఈరోజు నేను, నా కుటుంబం బతికి ఉండేవాళ్లం కాదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆ సమయంలో రవితేజ సార్ నా పాలిట దేవుడిలా వచ్చారు. ఆయన ఇచ్చిన ఒక్క అవకాశం నన్ను తిరిగి బతికించింది. అమ్మా నాన్నా.. ఈరోజు మీ కొడుకు బతికి ఉన్నాడంటే దానికి కారణం రవితేజ సార్," అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నా ప్రేమను మాటల్లో కాదు, నా సంగీతంలో చూపిస్తాను. సార్ నాకు దేవుడు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే నా పాటలకు ప్రాణం వస్తున్నట్లే" అని భీమ్స్ ఉద్వేగంగా ప్రసంగించారు.

భీమ్స్ ఎమోషనల్ స్పీచ్‌పై రవితేజ తనదైన శైలిలో స్పందించారు. "భీమ్స్ ఇంత ఎమోషన్ ఏంటయ్యా నువ్వు.. నీ ఎమోషన్ తగలెయ్య. స్క్రీన్ మీద ఇరగదీయబోతున్నాడు మా వాడు. సౌండ్‌తో సినిమా చూశాను, అద్భుతంగా ఉంది" అని అన్నారు. యంగ్ రైటర్ భాను బొగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాల మధ్య 'మాస్ జాతర' ఈ నెల‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News