మొంథా ఎఫెక్ట్: సముద్రంలో చిక్కుకున్న 600 మందిని కాపాడిన అధికారులు

  • మొంథా' తుపాను కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు
  • సముద్రంలో చిక్కుకుపోయిన 60 ఏపీ ఫిషింగ్ ట్రాలర్లు
  • సుమారు 600 మంది మత్స్యకారులను కాపాడిన అధికారులు
  • గోపాల్‌పుర్‌ ఓడరేవుకు సురక్షితంగా తరలింపు
‘మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 600 మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా కాపాడారు. భారీ వర్షాల కారణంగా ముందుకు కదలలేకపోయిన 60 ట్రాలర్లను ఒడిశా యంత్రాంగం గోపాల్‌పుర్‌ ఓడరేవుకు తరలించింది.
 
వివరాల్లోకి వెళితే.. మొంథా తుపాను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 60 ట్రాలర్లను గోపాల్‌పుర్‌ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది.
 
ఈ వివరాలను మత్స్యశాఖ ఉపసంచాలకుడు సంగ్రామ్ కర్‌ విలేకరులకు వెల్లడించారు. మొత్తం 600 మందినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించామని ఆయన తెలిపారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై గంజాం జిల్లా కలెక్టర్ కీర్తివాసన్ కూడా స్పందించి, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రస్తుతం మత్స్యకారులంతా గోపాల్‌పుర్‌ ఓడరేవులో సురక్షితంగా ఉన్నారు.


More Telugu News