చిత్ర పరిశ్రమలో పనివేళలపై రష్మిక కీలక వ్యాఖ్యలు

  • చిత్ర పరిశ్రమలో పనివేళలపై స్పందించిన రష్మిక
  • నెలల తరబడి సరిగ్గా నిద్రపోలేదని వెల్లడి
  • నటుల నుంచి లైట్‌మ్యాన్ వరకు అందరికీ నిర్ణీత పనివేళలు ఉండాలి
చిత్ర పరిశ్రమలో పనివేళలపై కొంతకాలంగా జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఎక్కువ గంటలు పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని, పరిశ్రమలో నటీనటుల నుంచి లైట్‌మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికీ నిర్ణీత పనివేళలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన కొత్త చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘‘ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పనిచేయడం సరైంది కాదు. వ్యక్తిగతంగా నేను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తాను. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచింది. కానీ, మీరు అలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటలపాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది’’ అని తోటి నటీనటులకు సలహా ఇచ్చారు. 

‘‘సినిమా పరిశ్రమలో కూడా నిర్దిష్టమైన పనివేళలు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇది కేవలం నటులకు మాత్రమే కాదు, దర్శకుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకు అందరికీ వర్తించాలి. దానివల్ల ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరుకుతుంది. నేను కూడా నా కుటుంబంపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాను. భవిష్యత్తు గురించే నా ఆలోచనలన్నీ. రేపు నేను తల్లి అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నాను’’ అని రష్మిక పేర్కొన్నారు. 

కాగా, 8 గంటల పనివేళలు డిమాండ్ చేయడం వల్లే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలో దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News