పుష్కర్ క్యాటిల్ షో... అందరి కళ్లు 'పుంగనూరు ఆవు' పైనే!

  • ప్రపంచ ప్రసిద్ధ పుష్కర్ పశువుల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా పుంగనూరు ఆవు
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశిష్ట జాతి పుంగనూరు ఆవు
  • ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న వైనం
  • రోజుకు 3 కిలోల మేత తిని 3 నుంచి 5 లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యం
  • ప్రధాని మోదీ వద్ద కూడా ఈ ఆవులు ఉండటంతో దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ పుష్కర్ అంతర్జాతీయ పశువుల జాతర-2025లో ఈసారి ఓ పొట్టి ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతరించిపోతున్న జాతి 'పుంగనూరు ఆవు' ఇప్పుడు ఈ జాతరకే తలమానికంగా మారింది. దాని చిన్న పరిమాణం, తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక పాల దిగుబడి పశుప్రేమికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

జైపూర్‌కు చెందిన అభిరామ్ బ్రీడింగ్ ఫామ్ యజమాని అభినవ్ తివారీ ఈ పుంగనూరు ఆవులను జాతరకు తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ జాతి ప్రత్యేకతలను వివరించారు. పుంగనూరు ఆవు కేవలం 28 నుంచి 36 అంగుళాల ఎత్తు, 150 నుంచి 200 కిలోల బరువు మాత్రమే ఉంటుందని తెలిపారు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, రోజుకు కేవలం 3 కిలోల పశుగ్రాసం తీసుకుని 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అభినవ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు ఆవు పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఆరోగ్యానికి మేలు చేసే ఏ2 ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ జాతి ఆవులను పెంచుతుండటంతో దేశవ్యాప్తంగా వీటిపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. అయితే, తాము ఈ ఆవులను అమ్మడానికి తీసుకురాలేదని, కేవలం దేశీయ జాతుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే ప్రదర్శిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పుంగనూరు ఆవులతో పాటు ఆయన తీసుకొచ్చిన చిన్న గుర్రాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

పుష్కర్ ఎడారి ఇసుక తిన్నెలపై మన ఆంధ్రా ఆవు తన ప్రత్యేకతలతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, రైతులు ఈ ఆవును చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానితో ఫోటోలు దిగుతూ, దాని విశేషాలు తెలుసుకుంటున్నారు. పొడి వాతావరణానికి సులువుగా అలవాటు పడటం, తక్కువ మేతతో ఎక్కువ ప్రయోజనం ఉండటంతో ఇది భారతీయ రైతులకు ఎంతో అనువైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు ఆవుకు లభిస్తున్న ఈ ప్రాచుర్యం, దేశీయ పశుజాతుల పరిరక్షణ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తోంది.


More Telugu News