ఇటీవల గెలిచి రచ్చ చేసిన నకమురపై సైలెంట్ గా రివెంజ్ తీర్చుకున్న గుకేశ్

  • క్లచ్ చెస్ టోర్నమెంట్‌లో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్‌పై గుకేశ్ విజయం
  • గతంలో గుకేశ్ రాజును విసిరి వివాదం సృష్టించిన నకమురా
  • తొలిరోజు ఆట ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన భారత స్టార్
  • మాగ్నస్ కార్ల్‌సన్‌, నకమురా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టిన గుకేశ్
  • తొలి గేమ్ గెలిచి, రెండో గేమ్‌ను డ్రా చేసుకుని మ్యాచ్ కైవసం
ప్రపంచ చెస్ ఛాంపియన్, భారత యువ సంచలనం గుకేశ్ దొమ్మరాజు, అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మంగళవారం జరిగిన "క్లచ్ చెస్: చాంపియన్స్ షోడౌన్" టోర్నమెంట్‌లో నకమురాపై అద్భుత విజయం సాధించాడు. ఈ విజయంతో అతను టోర్నమెంట్‌లో తొలిరోజు ఆట ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచాడు.

కొన్ని వారాల క్రితం జరిగిన "చెక్ మేట్: యూఎస్ఏ వర్సెస్ ఇండియా" ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో గుకేశ్‌పై గెలిచిన నకమురా, అతని రాజును బోర్డు పైనుంచి తీసి ప్రేక్షకుల వైపు విసిరి సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా వివాదానికి కారణమయ్యాడు. ఆ ఓటమికి, అవమానానికి తాజాగా గుకేశ్ తనదైన ప్రశాంత శైలితో ఈ మ్యాచ్‌లో బదులిచ్చాడు. తొలి గేమ్‌లో రాగోజిన్ వేరియేషన్‌తో ఆడిన గుకేశ్, నకమురాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి గెలుపొందాడు. రెండో గేమ్ 34 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. మ్యాచ్ అనంతరం ఇద్దరు ఆటగాళ్లు చిరునవ్వుతో కరచాలనం చేసుకున్నారు. నకమురా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోగా, గుకేశ్ మాత్రం తన అలవాటు ప్రకారం బోర్డుపై పావులను నెమ్మదిగా సర్దిన తర్వాతే కదిలాడు.

ఈ విజయంతో గుకేశ్ తొలిరోజు ఆట ముగిసేసరికి 6 గేమ్‌లలో 4 పాయింట్లతో అందరికంటే ముందున్నాడు. టోర్నీని మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఓటమితో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మూడు విజయాలు, రెండు డ్రాలతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కార్ల్‌సన్ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో, నకమురా 3 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఫాబియానో కరువానా 1.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఈ టోర్నమెంట్ రాపిడ్ డబుల్ రౌండ్-రాబిన్ పద్ధతిలో 18 గేమ్‌లతో జరుగుతుంది. తొలిరోజు విజయానికి 1 పాయింట్, రెండో రోజు 2, మూడో రోజు 3 పాయింట్లు చొప్పున లభిస్తాయి. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 4,12,000 డాలర్లు కాగా, విజేతకు 1,20,000 డాలర్లు అందుతాయి.


More Telugu News