కాకినాడను సమీపిస్తున్న 'మొంథా'... 190 కి.మీ దూరంలో తీవ్ర తుపాను

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మొంథా
  • ఈ రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన
  • తీరం దాటే సమయంలో 90-110 కి.మీ వేగంతో పెనుగాలులు
  • అప్రమత్తమైన ప్రభుత్వం, సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధం
  • ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని విపత్తుల సంస్థ సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తీవ్ర తుపాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ప్రస్తుతం కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య ఇది తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ దీని ప్రభావం కోస్తా జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని మరోసారి స్పష్టం చేశారు.

మరోవైపు, మొంథా తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.


More Telugu News