భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో గ్రామ పాలన అధికారి

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో ఘటన
  • భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60,000 డిమాండ్ చేసిన వైనం
  • ఇప్పటికే రూ.40,000 తీసుకోగా, మరో రూ.15,000 స్వీకరిస్తూ అరెస్ట్
  • నిందితుడు బానావత్ శ్రీనివాస్ రావుగా గుర్తింపు
  • లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు ఉద్యోగుల తీరు మారడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.15,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... ములకలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలోని పుసుగూడెం రెవెన్యూ క్లస్టర్‌లో బానావత్ శ్రీనివాస్ రావు గ్రామ పాలన అధికారిగా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తికి చెందిన 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ పని కోసం శ్రీనివాస్ రావు రూ.60,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ముందుగా రూ.40,000 చెల్లించాడు.

మిగిలిన రూ.20,000 కోసం అధికారి ఒత్తిడి చేయడంతో బాధితుడు తన ఆర్థిక పరిస్థితిని వివరించి కొంత తగ్గించాలని కోరాడు. దీనికి అంగీకరించిన శ్రీనివాస్ రావు, రూ.5,000 తగ్గించి, మిగిలిన రూ.15,000 వెంటనే ఇవ్వాలని సూచించాడు. ఈ క్రమంలో లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం బాధితుడు శ్రీనివాస్ రావుకు రూ.15,000 ఇస్తుండగా, అక్కడే మాటువేసిన అధికారులు అతడిని పట్టుకున్నారు. ఇంకో విష‌యం ఏమిటంటే.. ఆయ‌న అయ్య‌ప్ప స్వామి మాల‌లో ఉండి, ఇలా లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: ఏసీబీ
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.


More Telugu News