రాష్ట్రంలో ఐకానిక్ రైల్వే స్టేషన్లు... సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
  • నూతన పోర్టులకు తప్పనిసరిగా రైల్వే కనెక్టివిటీ ఉండాలని ఆదేశం
  • అమరావతి, గన్నవరంలో కొత్త రైల్వే కోచింగ్ టెర్మినళ్లకు ఆమోదం
  • విజయవాడ, విశాఖ, తిరుపతిలను ఐకానిక్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సూచన
  • హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్లపై చర్చ
  • రాష్ట్రంలోని రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  కాకినాడ, విశాఖ పోర్టులతో పాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, రామాయపట్నం వంటి పోర్టులకు తప్పనిసరిగా రైల్వే అనుసంధానం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైలు రవాణా కారిడార్లే కీలకమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కూలంకషంగా చర్చించారు.

హైస్పీడ్ రైల్వే కారిడార్లపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై మార్గాల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా, తిరుపతిని కలుపుతూ చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఖరగ్‌పూర్ నుంచి చెన్నై వరకు నిర్మించ తలపెట్టిన డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్ పనులపైనా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు ఉత్తర-దక్షిణ భారతాలను కలిపే మార్గాలపై దృష్టి సారించామని, ఇకపై తూర్పు-పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులకూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అమరావతి, గన్నవరంలో కొత్త టెర్మినళ్లు.. ఐకానిక్ స్టేషన్ల నిర్మాణం

రాజధాని ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి రైల్వే శాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ కోచింగ్ టెర్మినళ్లను విస్తరిస్తున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు, రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్లను 'ఐకానిక్ స్టేషన్లు'గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రైల్వే స్టేషన్‌ను కూడా వినూత్న డిజైన్‌తో నిర్మించాలన్నారు. తిరుపతిలో ప్రయాణికుల సౌకర్యార్థం స్కైవాక్ నిర్మించాలని, విశాఖలో జ్ఞానాపురం వైపు స్టేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 73 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఆధునీకరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, పుష్కరాల కోసం వివిధ ప్రాంతాల నుంచి 1,012 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని వారు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News