భారత జట్టులో చోటు కోల్పోవడంపై స్పందించిన కరుణ్ నాయర్

  • జట్టులో చోటు కోల్పోవడం బాధగా ఉంటుందన్న కరుణ్ నాయర్
  • తనకు ఒకే సిరీస్‌కు అవకాశం ఇచ్చారన్న కరుణ్ నాయర్
  • అంతకంటే ఎక్కువ అవకాశాలు పొందడానికి అర్హుడినని వ్యాఖ్య
టీమిండియాలో చోటు కోల్పోవడంపై కర్ణాటక స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ భావోద్వేగంగా స్పందించాడు. జట్టులో స్థానం కోల్పోవడం బాధగా ఉంటుందని అన్నాడు. తనకు ఒక సిరీస్‌లో అవకాశం ఇచ్చారని, అంతకంటే ఎక్కువ అవకాశాలు అందుకోవడానికి తాను అర్హుడినని పేర్కొన్నాడు.

జట్టులోని కొందరు తమ అభిప్రాయాలను తనతో పంచుకున్నారని, అది అంతవరకే పరిమితమని తెలిపాడు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించాడు. అంతిమంగా మన పని పరుగులు సాధించడమేనని అన్నాడు.

కరుణ్ నాయర్ గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టులో సెలక్టర్లు నాయర్ కు అవకాశం కల్పించారు. అయితే, ఆ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీనితో ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు కరుణ్ నాయర్ ను ఎంపిక చేయలేదు.

తన దేశం తరఫున ఆడాలని కోరుకుంటున్నానని అన్నాడు. అలాంటి అవకాశం రానప్పుడు, తాను ప్రాతినిధ్యం వహించే జట్టుకు అత్యుత్తమంగా ఆడుతూ వీలైనన్ని ఎక్కువ విజయాలు అందించాలని పేర్కొన్నాడు. ఆదివారం గోవా, కర్ణాటక జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ సందర్భంగా కరుణ్ నాయర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News