Harish Rao: హరీశ్ రావును రేవంత్ రెడ్డి ఎదుర్కోలేక కక్ష సాధింపు: సిట్ నోటీసులపై కేటీఆర్

KTR Slams Revanth Reddy for Vendetta Politics Against Harish Rao
  • రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శ
  • ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేసిన కేటీఆర్
  • హరీశ్ రావు నిలదీస్తున్నందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హరీశ్ రావును ఎదుర్కోలేక ఆయనపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, ఆ కేసును కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామా ముగిసిపోయిందని, అయినప్పటికీ మళ్లీ హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని ఆయన కొనియాడారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని ఆయన అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

తమకు చట్టంపై, న్యాయస్థానాలపై పూర్తి గౌరవం ఉందని, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కానీ విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని భావిస్తే అది భ్రమే అవుతుందని అన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, అడుగడుగునా ప్రశ్నిస్తుంటామని అన్నారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు తమ పార్టీ భయపడదని ఆయన స్పష్టం చేశారు.
Harish Rao
KTR
Revanth Reddy
Telangana
Phone Tapping Case
BRS
SIT
Political Vendetta
Coal Mines

More Telugu News