పోస్టాఫీస్ చఠ్‌పూజ సబ్సిడీ, లక్కీ డ్రా రివార్డు.. లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బులు గుల్ల

  • పోస్టాఫీస్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం
  • ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపిన పీఐపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
చఠ్ పూజ సబ్సిడీ లేదా లక్కీ డ్రా రివార్డు అంటూ పోస్టాఫీస్ పేరుతో ఏదైనా సందేశం మీకు చేరిందా?... ఒక వేళ వస్తే దీనితో జాగ్రత్త. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ సందేశంలోని లింక్‌ను క్లిక్ చేస్తే మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. పోస్టాఫీస్ పేరుతో ఈ సందేశం సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతోందని, ఈ సందేశం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

ఇలాంటి తప్పుడు సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరహా సందేశాలు వచ్చే లింక్‌లపై క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవుతుందని, దాని ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన డేటాను తస్కరించే ప్రమాదం ఉందని సూచించింది.

పోస్టల్ డిపార్టుమెంట్ ఎటువంటి సబ్సిడీ లేదా లక్కీ డ్రా పథకాలను ప్రకటించలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ఈ సందేశాలతో తపాలా శాఖకు లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసిది.

ఈ నకిలీ సందేశాలు అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉన్నాయని, సబ్సిడీలు, బహుమతుల పేరుతో ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. మీ బ్యాంకు, ఆధార్, పిన్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.


More Telugu News