బీజేపీకి ఓటు వేయకపోతే ఎంఐఎం బలం 8కి పెరుగుతుంది: రాంచందర్ రావు

  • జూబ్లీహిల్స్‌లో అసలు పోటీ బీజేపీ, ఎంఐఎం మధ్యేనన్న రాంచందర్ రావు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న రాష్ట్ర బీజేపీ చీఫ్
  • ఈ ఉప ఎన్నిక 2028 ఎన్నికలకు నాంది పలకాలని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ ఎన్నికలో అసలు పోటీ తమకు, ఎంఐఎం పార్టీకి మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే, మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన ఉపఎన్నికపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ప్రచారంలో నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. "జూబ్లీహిల్స్‌లో ఎంఐఎంను ఆపాలంటే బీజేపీని గెలిపించాలి. ప్రజల్లో కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచన బలంగా ఉంది" అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నాంది పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు, నామినేషన్ల పర్వం ముగియడంతో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. 


More Telugu News