రూ. 50 కోట్ల ఇన్సూరెన్స్ కోసం తండ్రి, తల్లి, భార్యను చంపిన కొడుకు!

  • ప్రమాదాల పేరుతో తల్లి, భార్యను కూడా చంపిన కొడుకు
  • రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ స్కామ్ దర్యాప్తులో వెలుగులోకి నిజాలు
  • చిన్న గాయాలైతే.. తలకు బలమైన గాయమని తప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్
  • ఆసుపత్రి సిబ్బంది సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
  • కొడుకు విశాల్, అతడి స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు
డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడంటారు. కానీ, మీరట్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యనే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏళ్ల తరబడి వీటిని ప్రమాదాలుగా నమ్మిస్తూ వచ్చిన ఈ దారుణాల వెనుక ఉన్న అసలు కుట్ర ఇటీవలే బయటపడింది. రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ హత్యల మిస్టరీని ఛేదించారు. రూ.50 కోట్ల బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే ఆసుపత్రిలో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన కొడుకు విశాల్ సింఘాల్‌ను, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏళ్ల తరబడి సాగిన హత్యల పరంపర
మీరట్‌లోని గంగా నగర్‌లో నివసించే ముకేశ్ సింఘాల్ కుటుంబం ప్రశాంతంగా జీవించేది. ఆయనతో పాటు భార్య ప్రభాదేవి, కొడుకు విశాల్, కోడలు ఏక్తా ఉండేవారు. 2017లో రోడ్డు ప్రమాదంలో ప్రభాదేవి తలకు తీవ్ర గాయాలై మీరట్‌లోని ఆనంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే, 2022లో కోడలు ఏక్తా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అదే ఆసుపత్రిలో చికిత్స తర్వాత చనిపోయింది.

ఈ క్రమంలో 2024 మార్చిలో ముకేశ్ సింఘాల్ కూడా హాపూర్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు చిన్న గాయాలు మాత్రమే కావడంతో మొదట నవజీవన్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అదే రోజు రాత్రి కొడుకు విశాల్ ఆయనను మీరట్‌లోని ఆనంద్ ఆసుపత్రికి మార్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ముకేశ్ కూడా మరణించారు. అయితే, ఇవన్నీ ప్రమాదాలు కావని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం విశాల్ సింఘాల్ పక్కా ప్రణాళికతో చేసిన హత్యలని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో సంభల్ పోలీసులు బయటపెట్టిన రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ మోసం కేసు దర్యాప్తులో ఈ దారుణాలు వెలుగుచూశాయి.

కుట్ర బయటపడిందిలా..
సంభల్ ఏఎస్పీ అనుకృతి శర్మ బృందం ఇన్సూరెన్స్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను ఛేదించినప్పుడు, ఇటీవల జరిగిన ప్రమాద మరణాలు, వాటి క్లెయిమ్‌ల డేటాను అన్ని కంపెనీల నుంచి తెప్పించుకున్నారు. ఆ పరిశీలనలోనే ముకేశ్ సింఘాల్ కేసు అనుమానాస్పదంగా కనిపించింది. ముకేశ్ పేరు మీద రూ.50 కోట్ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఇప్పటికే రూ.39 కోట్లకు పైగా క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. ఒక కంపెనీ నామినీగా ఉన్న విశాల్‌కు రూ.1.5 కోట్లు విడుదల చేయగా, మిగిలిన కంపెనీలు అభ్యంతరాలు తెలిపాయి.

ఏఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ "విశాల్ గతంలో ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేశాడు. అతడికి మానవత్వం లేదు, కేవలం డబ్బే ముఖ్యం. అందుకే, తానే నామినీగా ఉన్న తన కుటుంబ సభ్యులనే సులభమైన లక్ష్యాలుగా ఎంచుకున్నాడు" అని తెలిపారు.

ఆసుపత్రిలోనే తండ్రి హత్య
తల్లిని చంపిన తర్వాత విశాల్ తన తండ్రిని చంపడానికి మూడేళ్లు ఆగాడు. ఈ సమయంలో, అతడు వివిధ కంపెనీల నుంచి అనేక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొన్నాడు. 2024 మార్చి 27న తన బావ సంజయ్, స్నేహితుడు సతీశ్‌తో కలిసి హాపూర్‌లో తన తండ్రికి యాక్సిడెంట్ డ్రామా సృష్టించాడు. కానీ, ఆ ప్రమాదంలో ముకేశ్‌కు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. దీంతో ఆయనను ఆనంద్ ఆసుపత్రికి మార్చి, అక్కడ హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు, ఆసుపత్రిలోనే ఓ డాక్టర్‌కు రూ. లక్ష, మేనేజర్‌కు రూ. 50 వేలు ఇచ్చి వారి సహాయంతో ఏప్రిల్ 1-2 మధ్య రాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ముకేశ్‌ను హత్య చేశాడు.

ఫొటో, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో బట్టబయలు
ముకేశ్ మరణానికి ఒకరోజు ముందు, ఏప్రిల్ 1న, ఓ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఆసుపత్రికి వచ్చి ఆయన ఫొటో తీశాడు. ఆ ఫొటోలో ముకేశ్ తలపై ఎలాంటి గాయం లేదు. కానీ, మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టులో తలపై 6-8 సెంటీమీటర్ల లోతైన గాయం ఉన్నట్లు, ఛాతీ ఎముకలు విరిగాయని పేర్కొన్నారు. ఈ తేడాను గమనించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోస్ట్‌మార్టం రిపోర్టును తారుమారు చేసినట్లు తేలింది. తండ్రి మరణానికి రెండు నెలల ముందే విశాల్ నాలుగు ఖరీదైన కార్లను లోన్ మీద కొన్నట్లు కూడా దర్యాప్తులో గుర్తించారు. హాపూర్ పోలీసులు ఈ కేసును తిరిగి తెరిచి, పాత ఎఫ్‌ఐఆర్‌కు హత్య సెక్షన్లు జోడించారు. విశాల్, అతడి స్నేహితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆసుపత్రి పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది.


More Telugu News