రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. 63 ఏళ్ల రికార్డు బద్దలు!

  • కేవలం 540 బంతుల్లోనే ముగిసిన సర్వీసెస్-అసోం మ్యాచ్
  • 63 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన సర్వీసెస్ జట్టు
  • అసోంపై 8 వికెట్ల తేడాతో సర్వీసెస్ ఘన విజయం
  • సర్వీసెస్ బౌలర్ల ధాటికి ఒకే ఇన్నింగ్స్‌లో రెండు హ్యాట్రిక్‌లు
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఓ సరికొత్త చరిత్ర నమోదైంది. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా సర్వీసెస్, అసోం జట్ల మధ్య జరిగిన పోరు నిలిచింది. తిన్సుకియాలో జరిగిన ఈ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే ముగియడం విశేషం. ఈ మ్యాచ్‌లో అసోంపై సర్వీసెస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ గెలుపుతో సర్వీసెస్ జట్టు 63 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు 1962 జనవరిలో రైల్వేస్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ 547 బంతుల్లో ముగిసింది. ఇప్పటివరకు రంజీ చరిత్రలో అదే అత్యంత వేగవంతమైన మ్యాచ్‌గా రికార్డుల్లో ఉంది. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

మ్యాచ్ విషయానికొస్తే, రెండో రోజైన ఆదివారం సర్వీసెస్ విజయానికి అసోం నిర్దేశించిన లక్ష్యం కేవలం 71 పరుగులు మాత్రమే. ఈ స్వల్ప లక్ష్యాన్ని సర్వీసెస్ జట్టు కేవలం 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సర్వీసెస్ బౌలర్ల ధాటికి అసోం 103 పరుగులకే కుప్పకూలింది. ఇదే ఇన్నింగ్స్‌లో సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ, మోహిత్ జంగ్రా చెరో హ్యాట్రిక్ సాధించి అరుదైన ఘనతను అందుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అర్జున్ శర్మ.. రియాన్ పరాగ్, సుమిత్, శివశంకర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపగా, మోహిత్ జంగ్రా.. ప్రద్యున్ సైకియా, ముఖ్తార్ హుస్సేన్, భార్గవ్‌లను ఔట్ చేసి అసోం పతనాన్ని శాసించాడు.

ఈ విజయంతో ఎలైట్ గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన సర్వీసెస్ జట్టు, 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు రెండు మ్యాచ్‌లలో కేవలం ఒక పాయింట్‌తో అసోం ఐదో స్థానంలో నిలిచింది.




More Telugu News