‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు: మంత్రి నారా లోకేశ్

  • వైసీపీ అనుబంధ సోషల్ మీడియాపై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు
  • పక్క రాష్ట్రం వీడియోను అరకులో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • గతంలోనే ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలు వెల్లడించామన్న మంత్రి
  • అది రాజకీయ పార్టీనా లేక నేరగాళ్ల ముఠానా అని ఘాటు వ్యాఖ్య
  • ఫేక్ ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
  • ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని నారా లోకేశ్ సూచన
ఓ అంశంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొరుగు రాష్ట్రంలోని ఒక గురుకుల పాఠశాలలో 2023లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను, తాజాగా అరకులో జరిగినట్లు చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే శక్తులు సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆయన 'ఎక్స్' ద్వారా హెచ్చరించారు. 

"తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు. పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకు లో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

ఇదే వార్తపై, ఇదే వీడియో పై రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకుని మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఇలా తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిచ్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా, లేక హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మవద్దు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను వారిని కోరుతున్నాను" అని లోకేశ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News