శిథిలాల కింద పేలని బాంబులు.. గాజాలో మరో టెన్షన్

  • కూలిన బిల్డింగ్ ల శిథిలాల తొలగింపులో ఆటంకాలు
  • కాల్పుల విరమణ తర్వాత ఇప్పటి వరకు 560 బాంబులు గుర్తింపు
  • మరిన్ని పేలని బాంబులు ఉన్నాయంటున్న నిపుణులు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత గాజాలో ప్రస్తుతం శాంతి నెలకొంది. కాల్పుల మోతలు ఆగిపోయాయి. బాంబు దాడులు నిలిచిపోయాయి. యుద్ధ సమయంలో ప్రాణభయంతో వలస వెళ్లిపోయిన పాలస్తీనియన్లు గాజాకు తిరిగివస్తున్నారు. శిథిలాల కింద తమ గూడు వెతుక్కుంటున్నారు. కూలిపోయిన తమ కలల సౌధాలను చూసి నిట్టూర్పు విడుస్తున్నారు. శిథిలాలను తొలగించి గూడు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నంలో ప్రాణాలు పోతాయేమోననే భయం వారిని వెంటాడుతోంది.

యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబులలో కొన్ని పేలకుండా శిథిలాల కింద పడి ఉండటమే దీనికి కారణం. ఇటీవల ఇద్దరు చిన్నారులకు శిథిలాల కింద పేలని బాంబు లభించగా, దానిని ఆట వస్తువుగా భావించి ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆ బాంబు పేలడంతో పిల్లలిద్దరూ గాయపడ్డారు. యుద్ధం మొదలైన దగ్గర ఇలా 52 మంది మరణించారని..మరో 267 మంది గాయడ్డారని యునైటెడ్‌ నేషన్స్‌ మైన్‌ యాక్షన్‌ సర్వీస్‌ లెక్కలు చెబుతున్నాయి. భవనాల శిథిలాల తొలగింపునకూ ఆటంకాలు తప్పడంలేదని గాజా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

కాల్పుల విరమణ తర్వాత యూఎన్ఎమ్ఎస్ కు చెందిన నిపుణులు ఇప్పటివరకు దాదాపు 560 పేలని బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇంకా అనేక పేలని బాంబులు అక్కడ ఉండవచ్చని భావిస్తున్నారు. రెండేళ్ల యుద్ధంలో ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజావ్యాప్తంగా 60 మిలియన్‌ టన్నుల మేర శిథిలాలు పేరుకుపోయాయని అంచనా.


More Telugu News