మ్యూజియంలో దొంగిలించిన నగలను అమ్మడం ఎలా సాధ్యం.. నిపుణులు ఏమంటున్నారంటే?

  • లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ
  • నెపోలియన్ కు చెందిన విలువైన నగల అపహరణ
  • పలు సందర్భాల్లో విలువైన పెయింటింగ్స్ కూడా చోరీ
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియంలలో నుంచి విలువైన నగలు, పెయింటింగ్స్ ను పకడ్బందీగా చోరీ చేస్తారు సరే.. మరి ఆ చోరీ సొత్తును ఎలా సొమ్ము చేసుకుంటారనే అనుమానం రావడం సహజం. చోరీ విషయం ప్రపంచం మొత్తానికీ తెలిసిపోతుంది.. మీడియా ద్వారా ఆయా వస్తువుల ఫొటోలు వెలుగులోకి వస్తాయి. ఎవరైనా సరే చూడగానే వాటిని గుర్తిస్తారు.. ఇక ఆ దొంగసొత్తును కొనేదెవరు..? పోనీ ముక్కలు చేసో, కరిగించో అమ్మేయాలని చూసినా.. వందల కోట్లు విలువ చేసే ఆ నగను ముక్కలు చేస్తే వచ్చేది అంతంత మాత్రమే. ఆమాత్రం సొమ్ము కోసం ప్రాణాలకు తెగించి మరీ మ్యూజియంలో చోరీ చేయడమెందుకని అనిపిస్తుంది.

అమ్ముకుని సొమ్ము చేసుకోలేనపుడు ఎంత విలువైన నగలైనా, పెయింటింగ్స్ అయినా ఎవరైనా ఎందుకు దొంగిలిస్తారు.. కానీ, ఇలా మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టిన సొత్తును చోరీ చేయడానికే కాదు విజయవంతంగా ఎత్తుకొచ్చాక ఎలా అమ్మాలనే విషయంపైనా దొంగలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారట. ఈ చోరీ సొత్తు అమ్మకాలకు సంబంధించి న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైలా అమినెడోలెహ్ ఓ వ్యాసం రాశారు. ఇందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన వస్తువులు, పెయింటింగ్స్ ను దొంగలు ఎలా అమ్మేస్తారనే వివరాలను ఆమె వెల్లడించారు. మ్యూజియంలలో ప్రదర్శనకు పెట్టే విలువైన పెయింటింగ్స్, నగలను బ్లాక్ మార్కెట్ లో, డార్క్ వెబ్ సాయంతో అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతుంటారని వివరించారు.

డార్క్ వెబ్ లో అమ్మేవారు ఎవరని కానీ అటు కొనేవారు ఎవరనేది కానీ తెలియదని లైలా చెప్పారు. విలువైన పెయింటింగ్స్ ను సేకరించే హాబీ మాఫియా గ్యాంగ్ లలో చాలామందికి ఉంటుందని వివరించారు. బయట మార్కెట్ లో సదరు పెయింటింగ్ ఎంత ధర పలుకుతుందో అంతకంటే ఎక్కువ చెల్లించి మరీ వాటిని సొంతం చేసుకునే వారు కూడా ఉంటారని తెలిపారు. విలువైన నగల విషయానికి వస్తే.. దొంగలు వాటిని ముక్కలు చేసి అమ్మేస్తారని తెలిపారు. సాధారణ నగల మాదిరిగా ముక్కలైన వాటికి పెద్దగా విలువ ఉండదనే రూల్ ఈ అరుదైన నగలకు వర్తించదన్నారు.

ముక్కలుగా చేసినా వాటి విలువ ఏమాత్రం తగ్గకపోగా.. కొన్నిసార్లు మరింత పెరుగుతుందని ప్రొఫెసర్ లైలా అభిప్రాయపడ్డారు. లావ్రే మ్యూజియంలో జరిగిన చోరీనే తీసుకుంటే.. నెపోలియన్ కు చెందిన నగలను దొంగల నుంచి కొనుగోలు చేయడం సాధ్యమయ్యే పనికాదు. కానీ ఆ నగను ముక్కలు చేస్తే.. నెపోలియన్ ధరించిన నగలో ఓ చిన్న ముక్క అయినా సొంతం చేసుకోవాలని చాలామందికి ఉంటుందని ప్రొఫెసర్ చెప్పారు. అందుకే, ఇలాంటి దొంగతనాలు జరిగిన తర్వాత పోయిన వస్తువులను రికవరీ చేయడం దాదాపుగా అసాధ్యంగా మారిందని ఆమె వివరించారు.


More Telugu News