అమెరికా అధ్యక్ష పదవిపై కమలా హారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఎన్నికల సమయంలోనే ట్రంప్ ఫ్యాసిస్ట్ ధోరణిలో వ్యవహరిస్తారని హెచ్చరించానన్న కమలా హారిస్ 
  • భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా ఒక మహిళ ఉండటం ఖాయమని వ్యాఖ్య
  • మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోలేదన్న కమలా హారిస్
అమెరికా అధ్యక్ష పదవిపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా ఒక మహిళ వైట్‌హౌస్‌లో ఉండడం ఖాయమని, "బహుశా అది నేనే కావచ్చు" అని వ్యాఖ్యానించారు.

ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలా హారిస్ మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ట్రంప్ ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరిస్తారని హెచ్చరించానని, ఇప్పుడు అది నిరూపితమైందని ఆమె అన్నారు.

"నా మనవరాళ్లు వారి జీవితంలో ఖచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు" అని ఆమె పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కానీ రాజకీయాల్లో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ నమ్ముతున్నానని హారిస్ పేర్కొన్నారు. తాను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదన్నారు. తన కెరీర్‌ మొత్తాన్ని సేవలో గడిపానని, అది తన రక్తంలోనే ఉందని ఆమె అన్నారు.

అలాగే, తదుపరి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలపై స్పందిస్తూ, "పోల్స్ గురించి పట్టించుకోవడం లేదు. వాటిని నమ్మి ఉంటే, నేను ఇంతవరకు రాజకీయాల్లో ఉండేదాన్ని కాదు" అని ఆమె అన్నారు.

గత 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. 


More Telugu News