తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్... ఆధార్ లింక్ చేయకపోతే జీతాలు బంద్!

  • తెలంగాణ ఉద్యోగుల వేతనాలకు ఆధార్ లింక్ తప్పనిసరి
  • ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదుకు ఈ అర్ధరాత్రే గడువు
  • నిబంధన పాటించని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని హెచ్చరిక
  • అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయమన్న ఆర్థిక శాఖ
  • రాష్ట్రంలో 10.14 లక్షల మంది ఉద్యోగులపై ఈ నిర్ణయ ప్రభావం
  • గడువిచ్చినా సగం మంది కూడా వివరాలు నమోదు చేయని వైనం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులందరూ తమ ఆధార్ వివరాలను ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈరోజు (అక్టోబర్ 25) అర్ధరాత్రి వరకు గడువు విధించింది. గడువులోగా ఆధార్ వివరాలు నమోదు చేయని ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 10.14 లక్షల మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి పేరు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ప్రతి నెలా 10వ తేదీలోగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని గత నెలలోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ నెల 16వ తేదీ నాటికి సగం మంది ఉద్యోగులు కూడా తమ వివరాలను నమోదు చేయలేదు. దీంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వివరాలు సమర్పించని వారి జీతాల బిల్లులను ప్రాసెస్ చేయవద్దని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ఉద్యోగుల వివరాల్లో పారదర్శకత లేకపోవడం, కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడమే కారణంగా తెలుస్తోంది. కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగం మానేసినా లేదా అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నా వారి పేర్ల మీద జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఆధార్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను అనుసంధానించడం ద్వారా అసలైన ఉద్యోగుల సంఖ్యను తేల్చవచ్చని, తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. పలుమార్లు సూచించినా కార్యాలయాలు స్పందించకపోవడంతో ఆర్థిక శాఖ ఈసారి గడువు విధించి హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News