ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్!

  • థియేటర్ల వైపు నుంచి సక్సెస్ టాక్ 
  • ఓటీటీ వైవు నుంచి మంచి రెస్పాన్స్ 
  •  రికార్డు స్థాయిలో 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్
  • తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి 

హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ తరహా సినిమాలను ఒంటరిగా చూడటానికి భయపడేవారు, స్నేహితులతోగానీ .. ఇతర కుటుంబ సభ్యులతోగాని చూడటానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమానే 'కిష్కింధపురి'. బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకి,  కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా, థియేటర్స్ వైపు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. 

అలాంటి ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజులలోనే ఈ సినిమా 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకోవడం ఒక రికార్డుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఈ సినిమాకి, తమిళ .. మలయాళ .. కన్నడ ఆడియోను కూడా జోడించారు. దీంతో స్ట్రీమింగ్ మినిట్స్ మరింత దూకుడు చూపించడం ఖాయమనే చెప్పాలి. హైపర్ ఆది .. సుదర్శన్ .. తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించారు. 

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ రాఘవ - మైథిలి పాత్రలు పోషించారు. పాడుబడిన బంగ్లాలకు టూరిస్టులను తీసుకుని వెళ్లడం, దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేయడం చేస్తుంటారు. అలా ఒక బంగ్లాకు వెళ్లిన వాళ్లకి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది కథ. ఈ మధ్య కాలంలో వచ్చిన అసలు సిసలు థ్రిల్లర్ గా ఈ సినిమా మార్కులు కొట్టేయడం విశేషం. 



More Telugu News