ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుపాను... కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ తీరం వైపు ప్రయాణం
  • మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
  • మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటే సూచన
  • తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో గాలులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరిక
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి తీవ్ర తుపానుగా మారి, కాకినాడ సమీపంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

శనివారం ఉదయం 8:30 గంటల సమయానికి ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వాయుగుండం రేపటికి (అక్టోబర్ 26) తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి (అక్టోబర్ 27) ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. "ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు" అని ఆయన సూచించారు. కోస్తా తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడే ఈ తుపానుకు 'మొంథా' అని నామకరణం చేశారు. ఈ పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో 'మొంథా' అంటే 'సువాసన వెదజల్లే అందమైన పువ్వు' అని అర్థం.


More Telugu News