Rajasthan: ఒక్క జిల్లాలోనే 222 టన్నుల బంగారం.. రాజస్థాన్‌లో బయటపడ్డ కొత్త గనులు!

Rajasthan Banswara New Gold Mines Discovery
  • రాజస్థాన్‌లో వెలుగుచూసిన భారీ బంగారు నిల్వలు
  • బన్స్‌వారా జిల్లాలో మూడో బంగారు గని గుర్తింపు
  • సుమారు 222 టన్నుల స్వచ్ఛమైన బంగారం లభించే అవకాశం
  • దేశ డిమాండ్‌లో 25 శాతం తీర్చగలదని అంచనా
  • బంగారంతో పాటు ఇతర ఖనిజాలు కూడా లభించే ఛాన్స్
దేశంలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్, ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బన్స్‌వారా జిల్లాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఆవిష్కరణతో బన్స్‌వారా.. దేశానికి కొత్త స్వర్ణ రాజధానిగా మారే అవకాశం ఉంది. జిల్లాలోని ఘటోల్ తెహసీల్ పరిధిలోని కంకారియా గ్రామంలో ఈ నిల్వలను గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న భుకియా, జగ్‌పురా గనుల తర్వాత ఇది మూడో అతిపెద్ద బంగారు గనిగా నిలవనుంది.

భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన సర్వేల ప్రకారం, కంకారియా ప్రాంతంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర బంగారు ఖనిజం విస్తరించి ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఈ ప్రాంతంలో మొత్తం 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత సుమారు 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారం లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు వెలుగుచూసిన అతిపెద్ద బంగారు నిల్వల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

కంకారియా-గారా ప్రాంతంలో బంగారంతో పాటు రాగి, నికెల్, కోబాల్ట్ వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా లభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్ని అనుమతులు లభించి, మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే, భారతదేశంలో బంగారం తవ్వకాలు జరిపే అతికొద్ది రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో దేశం మొత్తం బంగారం డిమాండ్‌లో 25 శాతం వరకు ఒక్క బన్స్‌వారా జిల్లా నుంచే సరఫరా చేసే సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో భుకియా-జగ్‌పురా మైనింగ్ బ్లాక్‌ల కోసం ప్రభుత్వం నిర్వహించిన వేలంలో గెలిచిన సంస్థ.. అవసరమైన హామీ మొత్తాన్ని జమ చేయడంలో విఫలమైంది. దీంతో ప్రభుత్వం ఆ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ బ్లాక్‌ల కోసం మళ్లీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, నవంబర్ 3న బిడ్లను తెరవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక రెవెన్యూ వాటాను చెల్లించే సంస్థకు మైనింగ్ లైసెన్సును కేటాయించనున్నారు.
Rajasthan
Rajasthan gold mines
Banswara
gold reserves
gold mining
Kankariya
Bhukia Jagpura mines
mining license
mineral resources
India gold demand

More Telugu News