Australian Players: ఇండోర్‌లో ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. బైక్ నంబర్‌తో నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు

Australia Womens Cricket Team Harassment in Indore Accused Arrested
  • మహిళల ప్రపంచకప్‌ కోసం భారత్‌కు వచ్చిన ఆసీస్ క్రికెట‌ర్లు
  • హోటల్ నుంచి కేఫ్‌కు వెళుతుండగా బైక్‌పై వచ్చిన యువకుడి అసభ్య ప్రవర్తన
  • క్రికెటర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • బైక్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు
  • నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడి
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు ఇండోర్‌లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హోటల్ నుంచి ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా టీమ్ సెక్యూరిటీ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం ఇండోర్‌లోని ఖజ్రానా రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు తాము బస చేస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ నుంచి ఓ కేఫ్‌కు వెళుతుండగా, అకీల్ ఖాన్‌ అనే యువకుడు బైక్‌పై వారిని వెంబడించాడు. వారిలో ఒకరిని అసభ్యంగా తాకి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన క్రికెట‌ర్లు వెంటనే తమ బృందానికి ఎస్ఓఎస్ నోటిఫికేషన్ పంపించి, టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్‌కు సమాచారం అందించారు.

డానీ సిమన్స్ వెంటనే స్థానిక భద్రతా అధికారులతో సమన్వయం చేసుకుని, వారికి సహాయం కోసం వాహనాన్ని పంపించారు. అనంతరం, గురువారం సాయంత్రం ఆయన ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమానీ మిశ్రా స్వయంగా క్రీడాకారిణులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 74 (మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి నిందితుడి బైక్ నంబర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాని ఆధారంగా పోలీసులు నిందితుడు అకీల్ ఖాన్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అకీల్‌పై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Australian Players
Australia Women's Cricket Team
Indore
cricket harassment India
ICC Women's World Cup
sexual harassment
crime against women
Indian Penal Code
Khajrana Road
Radisson Blu Hotel
Dani Symons

More Telugu News