స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ జోనర్లో యథార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించాయి. ఆ వరుసలో వచ్చిన సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ఈ కథ 1960లలో మొదలవుతుంది. అర్జున్ చక్రవర్తి ( విజయ్ రామరాజు) ఓ అనాథ. హైదరాబాదులో తెగిన గాలిపటం మాదిరిగా తిరుగుతున్న అతణ్ణి రంగయ్య (దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. ఆయన మాజీ కబడ్డీ ప్లేయర్. ఒక ఆటగాడిగా నెరవేర్చుకోలేకపోయిన తన కలను, తన ఊరు పిల్లలు నిజం చేయాలనే ఆశతో ఉంటాడు. అందుకోసం అర్జున్ ను తీసుకుని తన ఊరు వెళతాడు. 

హైదరాబాద్ కి సమీపంలోని ఓ గ్రామం అది. అక్కడ కొంతమంది పిల్లలకు రంగయ్య కబడ్డీలో శిక్షణ ఇప్పిస్తూ ఉంటాడు. కబడ్డీ పట్ల ఆయనకి గల ఇష్టం .. తన ఊరుకు పేరు తీసుకురావాలనే పట్టుదలను అర్జున్ అర్థం చేసుకుంటాడు. తనని చేరదీసిన రంగయ్య మామ కలను నిజం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి ఒక దీక్షగా కబడ్డీని ఆడటం నేర్చుకోవడం మొదలుపెడతాడు. 

అర్జున్ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి, ఆ చుట్టుపక్కల కబడ్డీలో తనకంటే మొనగాడు లేడనే పేరు తెచ్చుకుంటాడు. ఈ సమయంలోనే అతను తన గ్రామానికి చెందిన దేవకి (సిజా రోజ్)ను ప్రేమిస్తాడు. జాతీయ స్థాయిలో గెలిచి వచ్చాక ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్షణాల కోసం తాను ఎదురుచూస్తూ ఉంటానని దేవకి చెబుతుంది. అర్జున్ ఆశయం ఫలిస్తుందా? దేవకిని పెళ్లాడాలనే ఆయన కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 1960 - 80లలో నడిచే కథ ఇది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో .. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఈ తరహా కథల్లో వాస్తవ సంఘటనలు ప్రతిబింబించాలి .. క్రీడా స్ఫూర్తిని కలిగించడమే కాకుండా ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ కావలసి ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా వెళుతూ, ప్రేక్షకులను కూడా కథలో భాగం చేయవలసి ఉంటుంది. అలాంటి ఫీల్ ను ఈ సినిమా వర్కౌట్ చేయగలిగిందా? అంటే చేయగలిగిందనే చెప్పాలి. 

1960 - 80లలో గ్రామీణస్థాయి క్రీడలు .. కబడ్డీ ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఈ కథ మొదలవుతుంది. గురువులు తమ కలను నిజం చేసుకోవడం కోసం శిష్యులను తయారు చేస్తారు. గురువుల కళ్లలో ఆనందాన్ని చూడాలనే తపనతో శిష్యులు కష్టపడతారు. దేశానికి పేరు తీసుకురావాలనే ఒక తపనతో వారి ప్రయాణం కొనసాగుతుంది. కానీ వారికి లభించే గౌరవం .. ఆర్థికపరమైన భరోసా అంతంత మాత్రం. కొంతమంది అధికారుల అవినీతి పంజరంలో వాళ్లు విలవిలలాడుతూనే ఉంటారనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. 

గ్రామీణ స్థాయిలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. కానీ వారికి తగిన గుర్తింపు .. గౌరవం లేకపోవడం వలన, మధ్యలోనే తమ ప్రయాణాన్ని విరమించుకుంటున్నారు. 'అవార్డులు అన్నం పెట్టనప్పుడు ఏ తల్లి మాత్రం తన కొడుకును ఆటగాడిని చేస్తుంది?' అనే ఒక్క డైలాగ్ చాలు .. ఆ రోజుల్లో పరిస్థితులకు అద్దం పట్టడానికి. కబడ్డీ ఆటకి జోడించబడిన సున్నితమైన ప్రేమకథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

పనితీరు: గ్రామీణ నేపథ్యంలో పేదరికాన్ని అనుభవిస్తూ .. క్రీడల పట్ల తమకి గల కోరికను నెరవేర్చుకోవడానికి యువకులు ఎంతగా కష్టపడవలసి వస్తుందనేది చూపించడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు. ఆ కాలంనాటి వాతావరణాన్ని తెరపైకి తీసుకుని రావడంలో సక్సెస్ అయ్యాడు.  

ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా తమ పాత్రలలో ఒదిగిపోయారు. జగదీశ్ చీకటి ఫొటోగ్రఫీ బాగుంది. విలేజ్ నేపథ్యంలో సన్నివేశాలను .. లవ్ ట్రాక్ నేపథ్యంలో దృశ్యాలను చిత్రీకరించిన తీరు అలరిస్తుంది. విఘ్నేశ్ భాస్కరన్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ నందం ఎడిటింగ్ కథకి తగినట్టుగా అనిపిస్తాయి. 

'అవకాశం బలవంతుడిని చేస్తుంది ..అవసరం బలహీనుడిని చేస్తుంది' .. 'ఆయుధాలతో చేసేది యుద్ధం కాదు, ఖాళీ కడుపుతో ..ఖాళీ చేతులతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్స్ వస్తావా పరిస్థితులకు అద్దం పడతాయి. 

ముగింపు: 1980లలో గ్రామీణ నేపథ్యంలోని యువకులకు పేదరికమే ప్రధానమైన శత్రువుగా నిలిచింది. కష్టాలను .. కన్నీళ్లను దాటుకుని ఎదిగితే, అవినీతి అధికారులు వారి ఆశయాలను అణచివేశారు. అలాంటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ సినిమా, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.