అమరవీరులకు చేతులెత్తి నమస్కరిస్తూ, క్షమాపణ కోరుతున్నా: ఎమ్మెల్సీ కవిత

  • జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ
  • గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
  • అమరవీరుల కుటుంబాలకు తలా రూ. కోటి ఇవ్వాలని డిమాండ్
అమరవీరులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నానంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి కవిత జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజా సేవ చేశానని గుర్తు చేశారు.

మంత్రి పదవి లేనందున తనకు అధికారికంగా సంతకం చేసే అవకాశం లేక అమరవీరుల కుటుంబాలకు పరిహారం విషయంలో న్యాయం చేయలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాల్లో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బు అందిందని, మిగతా కుటుంబాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు అంతర్గత వేదికలపై ఈ విషయాన్ని తాను చాలాసార్లు లేవనెత్తానని, మిగతా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరానని తెలిపారు.

ఈ విషయంలో తాను తగినంత పోరాటం చేయలేదని, అమరవీరుల కుటుంబాలకు డబ్బులు అందేవరకూ పోరాడాల్సిందని చెప్పారు. అందుకే ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రతీ అమరవీరుల కుటుంబానికీ రూ.కోటి చొప్పున అందజేయాలని రేవంత్ రెడ్డి సర్కారును కవిత డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం సాక్షిగా పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఈ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని, లేదంటే ప్రభుత్వాన్ని మార్చైనా సరే ఇప్పిస్తానని కల్వకుంట్ల కవిత ప్రమాణం చేశారు.


More Telugu News