నమ్మించి మోసం.. బాలీవుడ్ నటులపై యూపీలో చీటింగ్ కేసు

  • శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్‌తో పాటు 24 మందిపై ఎఫ్ఐఆర్
  • డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పి రూ.5 కోట్లు వసూలు
  • లోని అర్బన్ కో-ఆపరేటివ్ సొసైటీకి బ్రాండ్ అంబాసడర్లుగా నటులు
  • సొసైటీని మూసివేయాలని గతంలోనే అధికారుల ఆదేశాలు
  • శ్రేయస్ తల్పడేకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఊరట కల్పించిన సుప్రీంకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఒక భారీ పెట్టుబడి మోసం కేసులో వీరిద్దరితో పాటు మరో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోని అర్బన్ మల్టీ-స్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో జరిగిన ఈ మోసంలో నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

భాగ్‌పత్‌కు చెందిన బబ్లీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సొసైటీ ఏజెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, తాము సేకరించే డిపాజిట్లపై భారీ లాభాలు వస్తాయని, పెట్టిన డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని ప్రజలను నమ్మించారు. శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్ వంటి ప్రముఖ నటులు ఈ సంస్థకు ప్రచారం చేస్తుండటంతో చాలామంది వీరి మాటలు నమ్మి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అయితే, 2024 నవంబర్‌లో ఈ సొసైటీ తమ పేమెంట్ గేట్‌వేను అకస్మాత్తుగా నిలిపివేయడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది. గడువు ముగిసినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసులో ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జులైలో సుప్రీంకోర్టు శ్రేయస్ తల్పడేకు అరెస్ట్ నుంచి తాత్కాలికంగా మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే, 2025 మార్చి 3న సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (CRCS) ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, దానిని మూసివేయాలని (లిక్విడేట్) ఆదేశించింది. 2023 ఆగస్టులోనే సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా, వారి నుంచి సరైన స్పందన రాలేదని అధికారులు తెలిపారు.

తాజా ఎఫ్ఐఆర్‌లో నటులతో పాటు హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్నో, ముంబైకి చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, రీజనల్ మేనేజర్లు, మార్కెటింగ్ ఏజెంట్ల పేర్లను కూడా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. బ్రాండ్ అంబాసడర్లుగా ఉన్న కారణంగానే ఈ కేసులో నటుల పేర్లు చేర్చినట్లు తెలుస్తోంది.


More Telugu News