మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

  • తాజాగా బయటకు వచ్చిన 4 పేజీల సూసైడ్ లెటర్
  • ఓ ఎంపీ నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు లేఖలో వెల్లడించిన వైద్యురాలు
  • ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ల కోసం ఎంపీ బెదిరించారని ఆరోపణ
మహారాష్ట్రలోని సతారాలో సంచలనం రేపిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ బద్నే తనపై ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, అతడు పెడుతున్న శారీరక, మానసిక హింసను తట్టుకోలేక చనిపోతున్నానని తన చేతిపై రాసుకుని వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన నాలుగు పేజీల సూసైడ్ లెటర్ తాజాగా బయటకు వచ్చింది. ఈ లేఖలో ఎస్ఐ గోపాల్ బాద్నేతో పాటు ఓ ఎంపీపైనా బాధిత వైద్యురాలు ఆరోపణలు గుప్పించింది. మహారాష్ట్రకు చెందిన ఎంపీ ఒకరు తనను బెదిరింపులకు గురిచేశారని, తప్పుడు ఫిట్ నెస్ సర్టిఫికెట్ల కోసం తనపై ఒత్తిడి తెచ్చారని లేఖలో పేర్కొంది.

ఎస్ఐ గోపాల్ బాద్నే పలువురు నిందితులను వైద్య పరీక్షలకు తీసుకువచ్చేవాడని, వారు ఫిట్ గా లేకున్నా కూడా ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని బాధిత వైద్యురాలు తన లేఖలో వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో నిందితులను ఆసుపత్రికి తీసుకురాకుండానే సర్టిఫికెట్ ఇవ్వాలని వేధించాడని తెలిపింది. 

ఓ ఎంపీ అనుచరులు ఇద్దరు వచ్చి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని అడిగితే తాను నిరాకరించానని లేఖలో వెల్లడించింది. దీంతో వారు ఎంపీకి ఫోన్ చేసి తనతో మాట్లాడించారని, ఫోన్ లో ఎంపీ తనను పరోక్షంగా బెదిరించారని వైద్యురాలు ఆరోపించింది. ఓవైపు ఎస్ఐ బాద్నే తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండగా.. మరోవైపు, ఎంపీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర భయాందోళనలకు గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు తన లేఖలో వెల్లడించింది.


More Telugu News