Visakhapatnam RTO: విశాఖలో హైటెక్ డ్రైవింగ్ ట్రాక్... చిన్న తప్పు చేసినా డ్రైవింగ్ టెస్టులో ఫెయిలే!

Visakhapatnam RTO introduces hitech driving track strict test for license
  • విశాఖ గంభీరంలో ఏపీలోనే అతిపెద్ద డ్రైవింగ్ ట్రాక్
  • హైటెక్ సెన్సార్లు, సీసీ కెమెరాలతో కఠిన పరీక్షలు
  • చిన్న పొరపాటు చేసినా అనర్హులుగా ప్రకటించే టెక్నాలజీ
  • '8', 'హెచ్' ఆకారపు మలుపుల్లో డ్రైవింగ్ నైపుణ్యానికి అగ్నిపరీక్ష
  • ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు ఇదే విధానం
విశాఖపట్నంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. నగర శివారు గంభీరంలోని ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ఏపీలోనే అతిపెద్ద సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై డ్రైవింగ్ టెస్టులో మానవ ప్రమేయానికి తావులేకుండా, పూర్తిగా సాంకేతికత ఆధారంగానే అర్హులను ఎంపిక చేయనున్నారు.

ఈ కొత్త ట్రాక్‌ను పూర్తిగా హైటెక్ సెన్సార్లు, సీసీ కెమెరాలతో నిర్మించారు. వీటన్నింటినీ ఒక ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. టెస్టుకు హాజరైన వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ట్రాక్‌పై ఉన్న సెన్సార్లకు తగలకుండా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం రోడ్డు అంచును తాకినా, డివైడర్‌ను ఢీకొట్టినా, లేదా మలుపుల వద్ద సరిగ్గా తిప్పకపోయినా... సెన్సార్లు వెంటనే పసిగట్టి ఆ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తాయి.

ఈ ట్రాక్‌లో నిజమైన రోడ్లపై ఎదురయ్యే పరిస్థితులను సృష్టించారు. సాధారణ రోడ్లతో పాటు, జారుడు స్వభావం ఉన్న రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, కుడి, ఎడమ మలుపులు ఉంటాయి. ముఖ్యంగా '8', 'హెచ్' ఆకారంలో ఉండే మలుపుల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ కఠిన పరీక్షలో అన్ని విభాగాల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే అధికారులు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నారు.

ఈ విధానం కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాదు, కార్లతో పాటు భారీ వాహనాలకు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరీక్షల వల్ల నైపుణ్యం ఉన్న డ్రైవర్లకు మాత్రమే లైసెన్సులు జారీ అవుతాయని, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. 
Visakhapatnam RTO
Driving license Visakhapatnam
Hi-tech driving track
Scientific driving track
Gambhiram RTO office
AP driving test
Road safety Andhra Pradesh
Vizag driving test
Automated driving test
Driving skills test

More Telugu News