Saluri Vasurao: అందుకే బాలూపై కృష్ణకి కోపం వచ్చిందట!

Saluri Vasu Rao Interview
  • తనూ బాలూ మంచి స్నేహితులమన్న వాసూరావు 
  • తన పెళ్లి సమయంలో తనతోనే బాలూ ఉన్నారని వెల్లడి 
  • ఆ రోజునే కృష్ణగారి నుంచి ఆయనకి కబురు వచ్చిందని వివరణ 
  • బాలూ వెళ్లని కారణంగా కోపం వచ్చిందని వ్యాఖ్య  

అమృతం ఎలా ఉంటుందనేది ఈ నేలపై ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ కంటే మధురంగా ఉండబోదని కచ్చితంగా చెప్పగలరు. అంతగా తన గాన మాధుర్యంలో తేలియాడించిన గాన గంధర్వుడు ఆయన. ఏ హీరోకి పాడితే ఆ హీరోనే పాడినట్టుగా అనిపించేలా చేయడం బాలూకి మాత్రమే సాధ్యమైంది. ఇక భవిష్యత్తులో అలాంటి గాయకుడు రావడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అలాంటి బాలూపై హీరో కృష్ణకి కోపం వచ్చి .. కొంతకాలం పాటు తన సినిమాలకు ఆయనను దూరం పెట్టారు. 

సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. " బాలూగారూ .. నేను చాలా క్లోజ్. నా పెళ్లి చూపులకు కూడా ఆయన వచ్చారు. అంతేకాదు దగ్గరుండి నా పెళ్లి జరిపించారు. ఆ రోజంతా ఆయన నాతోనే ఉన్నారు. ఒక రకంగా అందువల్లనే కొంతకాలం పాటు కృష్ణగారికి బాలూగారు పాడలేకపోయారు. వాళ్లిద్దరికీ గ్యాప్ రావడానికి కారణం నా పెళ్లి అనే చెప్పాలి" అని అన్నారు. 

"నా పెళ్లి రోజు .. కృష్ణగారి పుట్టినరోజు ఒకటే రోజు. నా పెళ్లి రోజున బాలూగారు నాతోనే ఉన్నారు. అవతల కృష్ణగారు 'ఈనాడు' సినిమా చేస్తున్నారు. ఆ రోజున 'ఈనాడు' సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ గురించి బాలూగారిని రమ్మని హనుమంతరావుగారు కబురు చేశారు. ఫంక్షన్ లో ఉన్న కారణంగా తాను రాలేనని బాలూగారు చెప్పారు. దాంతో వాళ్లకి కోపం వచ్చేసింది. వెంటనే ముంబై నుంచి 'కిశోర్ కుమార్' ను పిలిపించారు కూడా. ఆ తరువాత చాలా కాలం పాటు కృష్ణగారికి బాలూ పాడలేకపోయారు" అని చెప్పారు. 

Saluri Vasurao
SP Balasubrahmanyam
Krishna
Eenadu movie
Telugu film industry
playback singer
Kishore Kumar
Suman TV interview
Telugu cinema music

More Telugu News